రోడ్లపై ధర్నా చేసే ముందు పదేళ్ల పాలనపై సమాధానం చెప్పాలి
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విఠల్‌రావు పాటిల్
నారాయణఖేడ్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రోడ్ల సమస్యపై ధర్నా చేసే ముందు గత పదేళ్ల పాలనలో ఏం చేశారో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని నాగల్‌గిద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విఠల్‌రావు పాటిల్(Congress President Vithal Rao Patil) అన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కరస్‌గుత్తి వద్ద భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ల ధర్నాపై స్పందిస్తూ, పదేళ్లు అధికారంలో ఉండి రోడ్లను పట్టించుకోకుండా ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలు, తండాలకు రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. నారాయణఖేడ్–కర్ణాటక సరిహద్దు బీటీ రోడ్డు రెన్యువల్‌కు సైతం మంజూరు లభించిందన్నారు.
కారముంగి–కరస్‌గుత్తి రహదారి ఏళ్లుగా ఇదే పరిస్థితిలో ఉంటే గతంలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మంజూరైన రోడ్లకు త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్, నారాయణ జాదవ్, సర్పంచ్ జైపాల్ నాయక్, నాయకులు రతన్‌సింగ్, రహీం, స్వామిదాస్, రఘు, వాలు నాయక్, తుకారాం, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.