రెండో టీ20లో ఇంగ్లాండ్ విజయం
డొనాల్డ్, సాల్ట్ మెరుపులు
1-1తో సిరీస్ సమం
కరారా ఓవల్, నవంబర్ 24: ఆస్ట్రేలియాతో(Australia) జరిగిన రెండో టీ మ్యాచ్‌లో ఇంగ్లాండ్(England) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నిఖిల్ చౌదరి (45), జోయెల్ డేవిస్ (39) రాణించగా, చివర్లో బెన్ డ్వార్షుయిస్ కేవలం 4 బంతుల్లో 3 సిక్సర్లతో 18 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ (2/29), హెన్రీ క్రోకోంబ్ (2/40) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 185 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు అనూరిన్ డొనాల్డ్, ఫిల్ సాల్ట్ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు.
వీరిద్దరూ కేవలం 61 బంతుల్లోనే 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనూరిన్ డొనాల్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 32 బంతుల్లో 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 85 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 30 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఔటయ్యాక టామ్ బాంటన్ (8 బంతుల్లో 26 నాటౌట్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (10 నాటౌట్) మిగిలిన పనిని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ కేవలం 13.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి, మరో 41 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.