భూములు అమ్మొద్దు

26-11-2026 | 05:40am

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై బీఆర్‌ఎస్ ఆగ్రహం

  1. హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడికి యత్నం 
  2. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిరాహార దీక్ష 
  3. పోలీసుల అరెస్ట్‌తో రోడ్డుపైనే బైఠాయించి నిరసన 
  4. నేతల అరెస్టును ఖండించిన కేటీఆర్, హరీశ్‌రావు

కూకట్‌పల్లి/హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రజా అవసరాలకు కేటా యించిన ప్రభుత్వ భూములను(Government lands) వేలం వేయొద్దని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలోని 3.15 ఎకరాల ట్రక్ పార్క్ స్థలాన్ని(Truck parking lot) ఈ నెల 27న, గురువారం వేలం వేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రకటన జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాధవరం కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ బుధవారం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని(HMDA Office) ముట్టడించేందుకు స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి బయలుదేరారు.

పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాధవరంతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.   ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని అణిచివేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను విక్రయిస్తే ఓటు అనే ఆయుధంతో సమాధానం చెబుతారని పేర్కొన్నారు. 

హైకోర్టులో పిల్..

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం వ్యవహారం చివరకు హైకోర్టుకు చేరింది. వేలం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. గురువారం జరగనున్న భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ భూములను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయించకుండా, ఆక్రమణలకు గురికాకుండా చూసేలా ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. మరోవైపు ట్రక్ పార్క్ ఓనర్స్ అసోసియేషన్, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లు సైతం కోర్టుమెట్లెక్కాయి. రేపటిలోగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. 

పోరాటం ఉధృతం: హరీశ్‌రావు

ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులపై పోలీసులతో నిర్బంధాలు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ట్రక్ పార్క్ భూముల వేలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకుల అరెస్ట్‌ను హరీశ్‌రావు తన ‘ఎక్స్’ ఖాతాలో ఖండించారు. అరెస్టయిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర అఖిలపక్ష నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ భూములను విక్రయించవద్దని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ చెబుతుంటే.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేలాన్ని రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం: కేటీఆర్ 

ట్రక్ పార్క్ భూముల పరిరక్షణకు పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని పేర్కొన్నారు. వేలం నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు