ఎస్బీఐ ఏటీఎం చోరీకి యత్నించిన నిందితుడి అరెస్ట్
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 11న జరిగిన ఎస్బిఐ ఏటీఎం చోరీ(SBI ATM Robbery)కి యత్నించిన దొంగను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ గంజ్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఎటిఎం ధ్వంసం చేసి దొంగతనాని కి యత్నించగా అలారం మోగడంతో అలర్ట్ అయి పారిపోవడంతో నిందితుడిని కొద్ది గంటల్లోనే కామారెడ్డి పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు.
ఈనెల 11న బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోరీకి యత్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ ఎదురుగా ఉన్న ఎస్ బి ఐ ఏటీఎం లోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందుగా ముఖానికి మాస్కు ధరించి ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలను తొలగించాడు. తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దొంగిలించేందుకు యత్నించాడు.
ఆ సమయంలో ఏటీఎం భద్రతా విభాగం నుండి ఒక్కసారిగా అలారం (సైరన్) మోగడంతో భయపడిపోయి డబ్బు తీసుకోకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు. ఏటీఎం బయట ఉన్న సి సి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో పట్టణ ఎస్హెచ్ఓ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు, పట్టణంలోని వాల్మీకి బ్యాండ్ షాపులో పనిచేస్తున్న మహారాష్ట్ర, పర్భణి జిల్లాకు చెందిన మహేష్ జ్ఞానోబా బిందే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. పదివేల రూపాయల అప్పు తీర్చడానికే దొంగతనం చోరీ యత్నం కు పాల్పడ్డట్లు, తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పట్టణంలోనే తలదాచుకున్న నిందితుడు, తన స్వగ్రామానికి పారిపోయేందుకు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా గురువారం పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా తాను ఒకరి వద్ద తీసుకున్న రూ.10 వేల అప్పు తీర్చేందుకే ఏటీఎం చోరీకి పథకం వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, ఏటీఎం నుండి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లుఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, సాంకేతిక ఆధారాల సాయంతో గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నర్సింలు, హోంగార్డు మోహన్ రెడ్డిలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నగదు రివార్డ్ తో ప్రోత్సహించి ప్రత్యేకంగా అభినందించారు. ఏటీఎంల భద్రత విషయమై బ్యాంక్ అధికారులతో తగిన జాగ్రత్తల గురించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.