కార్తీక మాసంలో కందికొండ జాతర!
భక్తి పారవశ్యం.. ఆధ్యాత్మిక వైభవం.. కొండకోనల్లో ప్రతిధ్వనించే గోవింద నామస్మరణ.. అఖండ జ్యోతి వెలుగుల్లో దేదీప్యమానంగా కనిపించే దివ్యక్షేత్రం.. ఇవన్నీ కలగలిపిన అపురూప ఆధ్యాత్మిక వేడుకే కందికొండ శ్రీ కందగిరి లక్ష్మీనరసింహ స్వామి జాతర(Kandikonda Sri Kandagiri Lakshmi Narasimha Swamy Jathara).
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామ శివారులోని ఏడు శిఖరాల గుట్టపై కొలువైన స్వామివారి వార్షిక జాతరకు కొండ ముస్తాబవుతోంది. ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ జాతర ఈ నెల 24వ తేదీ మంగళవారం వైభవంగా జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు.
స్కంద మహర్షి తపస్సుతో ఆవిర్భావం
కందికొండ గుట్టకు ఎంతో ప్రాచీనమైన స్థలపురాణం ఉంది. ఏడు శిఖరాలతో ప్రకృతి ఒడిలో అలరారే ఈ గుట్టపై స్వామివారు కొలువైన శిఖరం అన్నింటికంటే ఎత్తునదిగా ప్రత్యేకతను సంతరించుకుంది. చరిత్రలో ఈ ప్రాంతం కందికల్ గుట్టలుగా ప్రస్తావించబడినట్లు చెబుతారు. పూర్వం స్కందుడు అనే మహర్షి ఈ గుట్టపై ఘోర తపస్సు ఆచరించగా, ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రత్యక్షమై అనుగ్రహించినట్లు స్థలపురాణం వివరిస్తోంది.
కార్తీక పౌర్ణమి రోజున స్వామివారు దర్శనమిచ్చిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం అదే రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించాలని ఆదేశించినట్లు ఐతిహ్యం. అనంతరం స్కంద మహర్షి ప్రజల సహకారంతో ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలకు శ్రీకారం చుట్టినట్లు స్థానికుల విశ్వాసం. స్కంద మహర్షి తపస్సు కారణంగా ఈ గిరికి స్కందగిరి అనే పేరు వచ్చి, కాలక్రమంలో కందగిరిగా, కందికొండ గుట్టగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు.
శిఖరంపై అఖండ జ్యోతి
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతరలో అత్యంత విశిష్టమైన ఘట్టం సాయంత్రం నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమం. ఆలయ శిఖరంపై అఖండ జ్యోతిని వెలిగించి కొండపై నుంచి దింపే ఈ అపురూప దృశ్యం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జ్యోతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కార్తీక మాస పవిత్రతకు,
ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ జ్యోతి దర్శనం జాతరలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 24న జాతర నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పల్లాఫోల్ పురుషోత్తమాచార్యులు, సహ అర్చకులు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. జాతర నిర్వహణకు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది.
బండి సంపత్‌కుమార్ (మహబూబాబాద్, విజయక్రాంతి)
కష్టమైన కొండ దారిలో పయనం
కందికొండ జాతరలో కొండపైకి భక్తుల పాదయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గుట్టపైకి వెళ్లే మార్గం అంతగా అనుకూలంగా లేకపోయినా భక్తులు ఏమాత్రం వెనుకడుగు వేయరు. గోవిందా.. గోవిందా.. అంటూ స్వామి నామస్మరణ చేస్తూ కొండను అధిరోహిస్తారు. శారీరక ఆయాసాన్ని సైతం లెక్కచేయకుండా ఆలయ ప్రాంగణానికి చేరుకుని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
అనంతరం లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాల క్షేమం, ఆరోగ్యం, సుఖసంతోషాలు, సంతానం, సిరిసంపదలు కలగాలని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల కోరికలు ఆలకించి అభయమిచ్చే దైవంగా స్వామివారికి ఈ ప్రాంతంలో విశేషమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి.