ఝాన్సీ గడ్డపై ఝల్కారీబాయి
భారతీయ చరిత్రలో(Indian History) వక్రీకరణ, వివక్ష కారణంగా బహుజనుల వీరత్వానికి, పోరాటాలకు తగిన స్థానం దక్కలేదు. ఆధిపత్య వర్గాల చరిత్రకే ప్రాధాన్యం లభించడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహనీయులు, పోరాట యోధులు చరిత్రకు దూరమయ్యారు. అలాంటి మరుగునపడిన వీరనారుల్లో ఝల్కారీబాయి ఒకరు. 1857 నాటి తిరుగుబాటులో ఆంగ్లేయులతో వీరోచిత పోరాటం చేసిన వీరవనిత. ఆ సమయంలో ఝలారీ.. ఝాన్సీరాణి సైన్యంలో కమాండర్.
కానీ సావర్కార్ తన ‘ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857’ పుస్తకంలో ఝల్కారీని ఝాన్సీ దాసి గా ప్రస్తావించారు. యుద్ధంలో బ్రిటి ష్ సైన్యాన్ని గందరగోళానికి గురిచేసి లక్ష్మీబాయికి తప్పించుకునే అవకాశాన్ని కల్పించింది ఝల్కారీనే. కానీ అనేక మంది సాహిత్యకారులు తమ రచనల్లో ఝాన్సీరాణి వీరత్వాన్నే కొనియాడారు. పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో, అకాడమీల్లో ఝా న్సీనే వీర వనితగా చిత్రీకరించారు.
బాల్యం నుంచే..
ఝల్కారీ 22 నవంబర్ 1830లో బుందేల్ఖండ్ ఝాన్సీలోని భోజలా గ్రామంలో పుట్టింది. తల్లి దనియా, తండ్రి మాల్చంద్. కోరి కులానికి చెందినవారు. చిన్ననాడే ఝల్కారీలో వీరత్వం, సాహసం, ధైర్యం ప్రతిధ్వనించింది. 12 ఏళ్ల వయస్సులో అడివిలో పశువులు కాస్తున్నప్పుడు క్రూర మృగాలతో తలపడి చంపింది. ఈ వార్త ఝాన్సీరాణి దాకా, అలాగే ఆమె సైనికుడు పూరన్ కుటుంబానికీ చేరింది. అట్లాంటి వీరత్వం కలిగిన ఝలారీని కోడలుగా చేసుకోవాలనుకున్న పూరన్ తల్లి.. ఝల్కారీతో పూరన్ పెళ్లి జరిపించింది.
ఝల్కారీ రూపురేఖలు చూసిన ఝాన్సీరాణి ఆమెను తన మహిళా సైన్యంలో చేర్చుకోవాలనుకున్నది. భర్త పూరన్ ప్రోత్సాహం, ఆమెకు స్వతహాగా ఉన్న ఆసక్తితో ఝల్కారీ యుద్ధ నైపుణ్యాలు నేర్చుకుని మహిళా దళంలో చేరిన ఝలారీ ఘనత దళిత సమాజానికి స్ఫూర్తిదాయకమైనది. ఝాన్సీ, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో ఆమె కథలు, గీతాలు ఇంకా ప్రజా సంస్కృతిలో ఉన్నాయి. భోపాల్లో 2017లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ఝల్కారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
చరిత్రనే విముక్తి పాఠం..
చరిత్ర తెలియని జాతి.. చరిత్రను సృష్టించలేదన్నాడు అంబేద్కర్. ఏ జాతైనా తమ జాతి చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకున్నప్పుడే శత్రువు ఎవరో, మిత్రులెవరో తెలుస్తుంది. ఆ దిశగా విముక్తి పోరాటం సాగుతుంది. భారతదేశ చరిత్రంతా పాలకులు రాసుకున్నదే. ఇందులో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీల పోరాటానికి స్థానం లేదు. అగ్రవర్ణ చరిత్రపుటల అంచుల్లో మిగిలిపోయిన ఆ చరిత్రను వెలికితీసిన మహనీయులు పూలే, అంబేద్కర్. ఆ ఉద్యమ రథాన్ని ముందుకు నడిపించింది కాన్షీరామ్.. బహుజన రాజ్యాధికారానికి పునాది వేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఉన్న మాయావతి చేతులమీదుగా 15 అక్టోబర్ 1995న ఝల్కా రీ విగ్రహం ఆవిష్కరించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ విగ్రహం ద్వారా ఝల్కారీ పోరాటం ప్రపంచానికి తెలిసింది. తెలంగాణలో అగ్రకుల దోపిడీకి అభిముఖంగా పోరాడిన సమ్మక్క- చాకలి ఐలమ్మ చరిత్ర, పోరాటాన్ని సైతం తప్పుదారి పట్టించారు.
అయితే, ఆ పోరాటాల అసలు చరిత్రను బీసీ, ఎస్సీ, ఎస్టీ విముక్తి ఉద్యమ సారథి డాక్టర్ విశారదన్ మహారాజ్ సమాజానికి చాటి చెప్పారు. తెలంగాణ గడ్డపై బీసీ, ఎస్సీ, ఎస్టీల చరిత్రను పునర్జీవింపచేస్తూ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తున్నారు. ఈ చైతన్యమే బహుజన ఐక్యతకు, రాజ్యాధికార సాధనకు పునాది. అట్టడుగు వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుల గాథలే నేటి సామాజిక సమరానికి దిక్సూచి.
సెల్ : 7989579428