పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగం పెంచాలి
మహబూబాబాద్ టౌన్, నవంబర్ 11 (విజయక్రాంతి): పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగం పెంచి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల రవాణా, గుడుంబా కేసుల్లో పెండింగ్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(SP Sabarish) పోలీసులను ఆదేశించారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. డయల్ 112 కు వచ్చే ఫిర్యాదులపై సత్వర స్పందన అవసరమన్నారు.
అలాగే నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని, ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. నూతన క్రిమినల్ చట్టాల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. పెండింగ్ కేసుల్లో పరిష్కారం చూపడానికి దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నేరాలు జరగక ముందే నివారణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల సరఫరా నెట్వర్క్ పై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో పోలీసులు చూపిన చొరవను అభినందిస్తూ క్యాష్ రివార్డులు అందజేశారు.