కొత్తగా మరిపెడ మార్కెట్

17-11-2026 | 05:05am

కేసముద్రం, తొర్రూర్ మార్కెట్ల ఉనిఖి ప్రశ్నార్థకం..?

మహబూబాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) కొత్తగా మరిపెడ వ్యవసాయ మార్కెట్(New Marripeda Agriculture Market) ఆవిర్భావానికి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరడంతో ప్రస్తుతం ఉన్న కేసముద్రం, తొర్రూరు మార్కెట్ల ఉనిఖి ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఏర్పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో(Warangal District) ప్రత్యేక శ్రేణి హోదా కలిగిన మార్కెట్ గా, ఈ నామ్ విధానం(e-NAM system) ప్రవేశపెట్టిన తర్వాత అన్నదాతలకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సౌకర్యాలు కల్పించి పూర్తిగా డిజిటల్ పద్ధతి ద్వారా చెల్లింపులు జరుపుతూ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక గుర్తింపు పొందిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిస్థితి తిరుగమనంలో పడే అవకాశాలు ఉన్నట్లు అన్నదాతలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ లో నూతనంగా వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడానికి ఇప్పటివరకు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న మరిపెడ, చిన్న గూడూరు మండలాల పరిధిలోని గ్రామాలను చేర్చాలని, అలాగే తొర్రూరు మార్కెట్ పరిధిలో ఉన్న దం తాలపల్లి, నరసింహుల పేట మండలాల పరిధిలోని గ్రామాలను చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తు న్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కొ త్తగా మరిపెడ మార్కెట్ ఏర్పాటు జరిగితే ప్రస్తుతం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న మరిపెడ, చిన్న గూడూరు, తొర్రూరు మార్కెట్ పరిధిలో ఉన్న నరసింహుల పేట, దంతాలపల్లి మండలాలు తొలగింపు గురికానున్నాయి. ఈ మండలాలను తొలగిస్తే కేసముద్రం మార్కెట్ పరిధిలో కేస ముద్రం, ఇనుగుర్తి మండలాలు, తొర్రూ రు పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు మండలాలకు పరిమితం కానున్నాయి. 

ఆదాయానికి భారీగా గండి

కొత్తగా మరిపెడ మార్కెట్ ప్రారంభిస్తే కేసముద్రం, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ల ఆదాయానికి భారీగా గండి పడనుంది. మార్కెట్ల పరిధి తగ్గడంతో పాటు, కేసముద్రం మార్కెట్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న మరిపెడ చెక్పోస్ట్, తొర్రూరు మార్కెట్ పరిధిలో కొనసాగుతున్న దంతాలపల్లి చెక్పోస్ట్ ఆదాయం నూతనంగా ఆవిర్భవించనున్న మరిపెడ మార్కెట్ పరిధిలోకి చేరడం వల్ల, ప్రతి ఏటా ఈ రెండు చెక్పోస్టుల ద్వారా రెండు మార్కెట్లకు 5 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనున్నాయి.

నూతన మార్కెట్ గా మరిపెడ ఆవిర్భవిస్తే ప్రత్యక్ష పద్ధతిలో కొనుగోలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకుంటున్న కేసముద్రం మార్కెట్ ప్రతిష్ట పూర్తిగా మసక బారే పరిస్థితి తలెత్తనున్నాయి. ఆదాయం తగ్గి మార్కెట్ల గ్రేడు స్థాయి కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కేసముద్రం మార్కెట్ నుంచి చాలా కాలంగా మరిపెడ మార్కెట్ ఏర్పాటు కోసం అనేకసార్లు ఒత్తిడి వస్తున్నప్పటికీ, మార్కెట్ ప్రతిష్టను తగ్గించకూడదనే అభిప్రాయంతో గత ప్రభుత్వాలు మరిపెడ మార్కెట్ ఏర్పాటుకు అప్పట్లో సుముఖత వ్యక్తం చేయలేదు. 

తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ గా మారింది.

మరిన్ని వార్తలు