ఈసీని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వండి

17-11-2026 | 05:35am
  1. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండీ కూటమి 
  2.    48 ప్రశ్నలతో పిటిషన్.. నేడు విచారణ
  3. సర్‌కు ఎన్నికల సంఘం ఎలా ఓకే చెప్పింది? 
  4. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? 
  5. ఏ నిర్ణయం, ఏ తేదీన, ఏ సమయంలో తీసుకున్నారు? 
  6. ఓటర్ల డేటా, ఫామ్-6పై స్పష్టత ఏదీ? 
  7. ఈసీఐనెట్‌లో చేసిన మార్పులుచేర్పుల సంగతేంది? 
  8. వీటికి కోర్టు ముందు సీఈసీ, కమిషనర్లు సమాధానం ఇవ్వాలని అభ్యర్థన

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఓట్ చోరీపై(Vote theft) ఇండీ కూటమి(INDIA Alliance) న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్(Gyanesh Kumar) రాజీనామా కోసం ర్యాలీలు, ధర్నాలతో ఆందోళనలు నిర్వహించిన కూటమి నేతలు.. ఇప్పుడు సుప్రీంకోర్టులో(Supreme Court) నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రత్యేక పిటిషన్ దాఖలు(Filing of a special petition) చేశారు. ఎన్నికల సంఘంలోని(Election Commission) సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌తోపాటు కమిషనర్ల సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, ఇతర ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు.

48 ప్రశ్నలను అడగదలుచుకున్నామని చెప్తూ.. వాటిని కోర్టుకు సమర్పించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో(Rahul Gandhi) పాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘సర్’ విషయంలో సీఈసీ తీరును తప్పుబడుతూ ఇప్పటికే వీరు దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఆ పెండింగ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈసీని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇండీ కూటమి తాజాగా పిటిషన్ వేసింది. దీనిపై కూడా మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అయితే.. ఈసీని ప్రశ్నించేందుకు న్యాయస్థానం ఓకే చెప్తుందా, లేదా అన్నది ఉత్కంఠకు దారితీసింది. 

ఇండీ కూటమి ప్రశ్నల్లో కొన్ని..!

ఇండీ కూటమి దాఖలు చేసిన పిటిషన్‌లో 48 ప్రశ్నలను కోర్టుకు సమర్పించింది. ముఖ్యంగా సర్, ఓటర్ల డేటా, ఫామ్ కమిషనర్ల మధ్య అభిప్రాయభేదాలు వంటి అంశాలను కీలకంగా పేర్కొంది. వీటిపై తమకు స్పష్టత కావాలని కోరింది. న్యాయస్థానం ముందు ఈసీని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది. 

* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టాలన్న నిర్ణయం ఎప్పుడు, ఎలా తీసుకున్నారు? దీనికి అధికారికంగా అనుసరించిన ప్రాసెస్ ఏమిటి? 2025లో దేశవ్యాప్తంగా సర్ చేపట్టాలని ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.. అయితే, ఆ ఉత్తర్వులకు ఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు? దీనికి ఆమోదం ఫైల్ సర్క్యులేషన్ ద్వారానా.. లేక ఎలక్ట్రానిక్ విధానంలోనా తెలిపారా? ఈసీలోని కమిషనర్లు ఆమోదం తెలిపిన తేదీలు ఏమిటి? 

* 2025 ఫిబ్రవరి 19 నుంచి 2026 అక్టోబర్ 26 వరకు సర్, ఈసీఐనెట్, ఫామ్ అప్పీళ్లకు సంబంధించిన అంశాల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఎన్ని సందర్భాల్లో లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలిపారు? కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? ఏదైనా అంశంపై విభేదాలు వచ్చాయా? అన్నింటికీ సంబంధించి తేదీలు, ఫైల్ నంబర్ వెల్లడించాలి. 

* 2023 చట్టంలోని సెక్షన్ 18(2) ప్రకారం సర్‌కు సంబంధించి నిర్ణయాలను మెజారిటీ ప్రాతిపదికన తీసుకున్నారా? తీసుకుంటే ఆ వివరాలు కావాలి. ఇందులో ఏ కమిషనర్ అయినా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే తను ఎవరో వెల్లడించాలి.

* ఓటర్ల జాబితా డేటా బేస్‌లో పేర్ల మార్పు, చేర్పులు వంటి అధికారాలు ఎవరెవరికి ఉన్నాయో తెలియజేయండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు కూడా డేటాలో మార్పులు చేసే అధికారం ఉందా? అనే దానిపై స్పష్టత కావాలి. ఈసీఐనెట్‌లో ఓటర్ల వివరాల్లో చేసిన ప్రతి మార్పునకు సంబంధించి యూజర్ ఖాతా, తేదీ, సమయం.. వాటికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) ఆర్డర్స్ వివరాలు ఇవ్వండి.

* ఆన్‌లైన్ ఫామ్-6లో చేసిన మార్పులు, కొత్తగా ప్రవేశపెట్టిన డిక్లరేషన్ వివరాలు కావాలి. ఆ డిక్లరేషన్ కారణంగా తిరస్కరణకు గురైన ఓటర్లు ఎంత మంది? పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఎన్ని?.. అనే డేటా ఇవ్వండి. పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగించడంపై పూర్తి వివరాలు కావాలి. 

* రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం ప్రతి ప్రశ్నకు వాస్తవాలతో కోర్టు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. సీఈసీ, కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులు అధికారిక రికార్డులతో జవాబు చెప్పాలి. 

మరిన్ని వార్తలు