'ఓట్ చోర్' నినాదంతో వివాదం.. ఇటలీ నేతపై బీజేపీ ఫిర్యాదు!
హైదరాబాద్: భారత్ సమ్మిట్(Bharat Summit) వేదికగా ఇటలీ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నాయకత్వం అధికారికంగా ఫిర్యాదు చేసింది. పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (PES) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్(Italian Leader Giacomo Filibeck) భారత అంతర్గత రాజకీయ వ్యవహారాలపై వ్యాఖ్యలు చేయడం, 'ఓట్ చోర్.. గద్దీ ఛోడ్'(Vote Chor Gaddi Chhod) నినాదం ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
నవంబర్ 14న హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో ఫిలిబెక్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ రాజకీయ నాయకుడిగా భారత ఎన్నికలు, రాజకీయ నాయకత్వంపై వ్యాఖ్యలు చేయడం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(Telangana BJP President N. Ramchandra Rao) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులను కలిసి ఫిర్యాదు అందజేసింది.
ఫిలిబెక్ ఏ కేటగిరీ వీసాపై భారత్‌కు వచ్చారు? పర్యటనకు ప్రకటించిన ఉద్దేశం ఏమిటి? ఆయన వ్యాఖ్యలు వీసా నిబంధనలను ఉల్లంఘించాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని నిబంధనల ప్రకారం ఉల్లంఘనలు నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది.
అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు, చట్టపరమైన ఆధారాలు ఉంటే దేశం నుంచి బహిష్కరించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరింది. అంతేకాకుండా భారత్ సమ్మిట్ నిర్వాహకులు, స్పాన్సర్ల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేసింది. అయితే ఫిలిబెక్ వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇంకా అధికారికంగా తేలలేదు. ఈ అంశంపై సంబంధిత అధికారుల విచారణ, తదుపరి చర్యలు ఆసక్తికరంగా మారాయి.