గవర్నర్ పురస్కారాలు.. విజేతలకు రూ.2 లక్షలు
హైదరాబాద్: సమాజ మార్పు కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలకు తెలంగాణ లోక్‌భవన్(Telangana Lok Bhavan) ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అవార్డుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లోక్‌భవన్ ప్రత్యేక కార్యదర్శి దాన కిశోర్(Lok Bhavan Special Secretary Dana Kishore) విడుదల చేశారు.
ఈసారి నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ట్రాన్స్జెండర్ల సంక్షేమం(Transgender Welfare), విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు విశేషంగా పనిచేస్తున్న వారిని ఈ అవార్డుల ద్వారా గుర్తించనున్నారు.
జనవరిలో విజేతల ప్రకటన
2027 జనవరి మొదటి వారంలో అవార్డు విజేతల పేర్లను ప్రకటించనున్నారు. అనంతరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేయనున్నారు. ఎంపికైన ప్రతి విజేతకు రూ.2 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేయనున్నారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సాహం అందించడంతో పాటు వారి సేవలకు తగిన గుర్తింపు తీసుకురావడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశం.