పసిబిడ్డ అమ్మకం..?
మహబూబాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని(Mahabubabad District) ఓ గ్రామంలో నాలుగు నెలల పసిబిడ్డను తల్లిదండ్రులు అమ్మేసినట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ(Department of Women and Child Welfare) సిబ్బంది ద్వారా అధికారులు ప్రాథమికంగా అంచనా కు వచ్చారు. ఓ గ్రామానికి చెందిన దంపతులకు మూడు నెలల క్రితం బిడ్డ జన్మించిన తర్వాత ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లినట్లు సమాచారం. అక్కడే ఆ పసి బిడ్డను విక్రయించి రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన దంపతులను ఐసీడీఎస్ సిబ్బంది(ICDS Staff) పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయడానికి వెళ్లిన సమయంలో పసిబిడ్డ కనిపించలేదు.
దీనితో ఆ దంపతులను బిడ్డ విషయంపై ప్రశ్నిస్తే అసంబద్ధమైన సమాధానాలు ఇవ్వడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. పోలీసుల సహకారంతో శుక్రవారం ఆ గ్రామానికి ఐసీడీఎస్ అధికారులు చేరుకొని దంపతులను సిడబ్ల్యుసి కమిటీ ముందు ప్రవేశపెట్టారు. పుట్టిన బిడ్డ ఏమైందని ప్రశ్నిస్తే బిడ్డ చనిపోయిందని, మృతదేహాన్ని కాలువలో పడేసామని, ఈ విషయాన్ని బంధువులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం వరకు తమకు గడువు ఇవ్వాలని సీడబ్ల్యూ సీ నీ ఆ దంపతులు కోరారని,అయితే ఈ విషయంపై తమ పరిధిలో కూడా విచారణ చేపట్టామని మహబూబాబాద్ సీడీపీవో శిరీష తెలిపారు.