అంబానాయక్ తండా @ మెక్సికో వరకు
* శైలజకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రోత్సాహం
కోహెడ, నవంబర్ 13: అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు(International-level football competitions) ఎంపికైన హుస్నాబాద్ నియోజకవర్గం(Husnabad Constituency) అక్కన్నపేట మండలం అంబానాయక్ తండాకు చెందిన క్రీడాకారిణి బానోతు శైలజకు(Sportswoman Bhanothu Sailaja) రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని శైలజ తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, వచ్చే ఏడాది జనవరిలో మెక్సికో సిటీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై మంత్రి ఆమెను అభినందించారు.
పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, వీసా, విమాన టికెట్ల ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం మంజూరు చేశారు. అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.
తనకు ఆర్థిక సహకారం అందించిన మంత్రి వాకిటి శ్రీహరితో పాటు, హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి లకు శైలజ, ఆమె తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.