ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలి
మహబూబాబాద్: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను(Teachers' pending issues) పరిష్కరించాలని, ఉన్న పాఠశాలలను బలోపేతం చేయాలని, కొత్తగా పాఠశాలలు అవసరం లేదని టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి(TSUTF State Secretary Sama Mallareddy) అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ(PRC) ప్రకటించడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
కురవి మండల కేంద్రం లో ఉన్నత పాఠశాలలో పి మంజుల అధ్యక్షతన జరిగిన కురవి మండల మహాసభలో ముఖ్య అతిధిగా పాల్గొని మల్లారెడ్డి మాట్లాడుతూ పీఆర్సి కమీషన్ గడువు ముగిసిన పీఆర్సి రిపోర్ట్ తెప్పించుకోకపోవడం శోచనీయం అని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే తెప్పించి, పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న కరువు భత్యం (డీఏ)లను విడుదల చేయడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 25 ను సవరించి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి, నర్సరీ, కేజీ తరగతులు ప్రవేశపెట్టి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందచేయుటకు తగు చర్యలు తీసుకోవాలని, ఒక్క నూతన పాఠశాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్మించాల్సిన అవసరం లేదని, ఉన్న బడుల తోనే అరవై లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన చదువు ప్రభుత్వ బడుల్లోనే ఉచితంగా అందించవచ్చన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యామ్నాయం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కావని, ప్రతి పాఠశాలను టీ పి ఎస్ లుగా తీర్చిదిద్ది ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి విద్యను అందరికి అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ విద్యా విలీన నిర్ణయాన్ని టీఎసీయూటీఎఫ్ స్వాగతిస్తూనే విలీనం అమలులో ఎదురయ్యే విద్యారంగ, మౌలిక సదుపాయాల సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని కోరారు.
ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో ముందస్తు చర్చలు జరిపిన అనంతరమే నిర్ణయాలను అమలు చేయాలని సూచించారు. పెండింగ్ బిల్స్ క్లియర్ అయ్యేంతవరకు నెలకు 2000 కోట్లు కేటాయించి పెండింగ్ బిల్స్ చెల్లించాలని అన్నారు. సీపీఎస్ ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలనీ, ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇచ్చి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
ఈ మహాసభలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ మురళీకృష్ణ, షేక్ యాకూబ్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.సంజీవ, మండల ప్రధాన కార్యదర్శి ఎం.ప్రవీణ్ కుమార్, మండల సభ్యులు బాబు, రమ్య, కృష్ణకుమారి, బాలరాజు, అష్మత్ పాషా, విజయరాణి, లక్ష్మయ్య, సురేష్, మల్లయ్య, లత, మాధవి, సంధ్యారాణి, ప్రగతి, శోభరాణి, రీఛా, రమేష్, రవీందర్, శ్రీనివాస్, మహాముద్ అలీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.