ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట
రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి కృషి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): జంగేడు వెళ్లే రహదారి విస్తరణ(Road widening), డ్రైనేజీ అభివృద్ధితో పాటు ప్రజల ఆస్తులు, హక్కులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) తెలిపారు. గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రహదారులు, డ్రైనేజీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 30, 35, 40 అడుగుల మేర రహదారి విస్తరణకు సంబంధించిన కొలతలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ స్తంభాలను తొలగించడం, వీధి వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. రోడ్లు, డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అభివృద్ధి పనులతో పాటు ప్రజల ఆస్తులు, హక్కులు, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.