విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
భీమిని, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) ఆదేశించారు. బుధవారం భీమిని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వంట శాల, భోజన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. మండలంలోని మల్లిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, బోధనా తీరును పరిశీలించారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వి.ఓ. భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన వసతులు కల్పించేలా నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కర్ణదాస్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.