కరెంటు కోతలతో రైతుల కంట కన్నీరు..!
- వరి పొలాలకు నీరందక విలవిల
- విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం..!
కోటపల్లి, అక్టోబర్ 9 : అన్నదాతల కష్టాలు తీర్చాల్సిన పాలకులు, అధికారులు వారి సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విద్యుత్ కోతలు రైతులకు శాపంగా మారాయి. ఒకవైపు కరెంటు కోతలు.., మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు.., ఇంకోవైపు అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
24 గంటల విద్యుత్ ఎక్కడ..?
గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేదని, దీంతో వరి పొలాలకు అవసరమైన సమయంలో నీటిని అందించుకునే అవకాశం ఉండేదని రైతులు గుర్తుచేస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల కారణంగా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సుమారు ఐదు నుంచి ఐదున్నర గంటలపాటు మాత్రమే విద్యుత్ అందుతోందని,
ఆ సమయంలోనూ నిరంతర సరఫరా లేకపోవడంతో పొలాలకు సరిపడా నీరు అందడం లేదని వాపోతున్నారు.వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలోనే మరమ్మతుల పేరుతో విద్యుత్ సిబ్బంది మధ్యమధ్యలో ఎల్సీలు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటికే పరిమితంగా అందుతున్న విద్యుత్లోనూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. వరి పంటకు కీలకమైన సమయంలో నీరు అందకపోతే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి విద్యుత్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
విద్యుత్ సిబ్బంది కొరత...
కోటపల్లి మండల కేంద్రంలోనే విద్యుత్ శాఖకు సంబంధించిన ఏఈ సిబ్బంది అందుబాటులో లేకపోవడం రైతులకు మరింత ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.పంటలు సాగు చేయడానికి పెట్టుబడులు పెట్టి, పగలు రాత్రి కష్టపడుతున్న రైతులకు సకాలంలో విద్యుత్ అందించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరాపై పర్యవేక్షణ ఏదీ...?
వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం మండలంలో సుమారు 7,250 ఎకరాల్లో వరి సాగు జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంత విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్న రైతులకు సకాలంలో విద్యుత్ అందకపోతే సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారు? సరఫరా సమయంలో అంతరాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మండల కేంద్రంలో ఏఈ, సిబ్బంది అందుబాటులో ఉండేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
మొరపెట్టుకుంటున్నా స్పందన లేదు...
ప్రతిసారి విద్యుత్ సమస్య లు ఎదురైనప్పుడు సిబ్బందికి మొరపెట్టుకుంటు న్నాం. సమస్య పరిష్కరించాలని కోరితే కింది స్థాయి సిబ్బంది మ నకు ఏఈ సాబ్ లేడు.. ఆ సార్ ఉంటేనే పనులు అవుతాయి అని చెబుతున్నారు. మరి మా సమస్యలు పరిష్కరించేదెవ రు? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఒకే ట్రాన్స్ఫార్మ్ప 18 డీడీలు ఉం డటంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ట్రా న్స్ఫార్మ్ప భారం పెరిగి పదేపదే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తోంది. దీంతో విద్యుత్ సరఫరాకు అం తరాయం కలిగి, వరి పొలాలకు సకాలంలో నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే కరెంటు కోతలతో సతమతమవు తుంటే, ట్రాన్స్ఫా ర్మర్ సమస్యలు మా కష్టాలను మరింత పెంచుతున్నాయి.
దుర్గమ్మ మల్లయ్య, సర్వాయిపేట రైతు