అభివృద్ధి పేరిట మట్టి దందా!

06-11-2026 | 05:35am
  1. పుష్కర ఘాట్ల వద్ద తవ్వకాలు
  2. హైటెక్ సిటీలో అమ్మకాలు
  3. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం

మంచిర్యాల, నవంబర్ 5 (విజయక్రాంతి): మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలో మట్టిదందా జోరుగా సాగుతోంది. అభివృద్ధి పనుల పేరిట తీస్తున్న మట్టిని ప్రైవేటుగా అమ్ముకుంటూ కాంట్రాక్టర్ జేబులు నింపుకుంటున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తు న్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంచిర్యాల సమీప గోదావరి తీరంలో పుష్కర ఘాట్ల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇదే అదనుగా గోదావరిలో తీస్తున్న మట్టిని సదరు కాంట్రాక్టర్ మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలోని ప్లాట్లకు తరలిస్తూ అమ్ముకుంటున్నాడు.

ఇదంతా చూస్తున్న సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకొని వదిలేస్తున్నారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యాపారికి పుష్కర ఘాట్ల వద్ద అభివృద్ధి పనులకు తీస్తున్న మట్టిని ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది, కాని ఇలా బహిరంగంగా పట్టపగలే తరలిస్తున్నప్పటికి ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని పట్టణ వాసులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. 

మట్టిదందాకు అండ ఎవరు..?

పుష్కర ఘాట్ పనుల కోసం గోదావరి తీరంలో వెలికితీస్తున్న మట్టిని బహిరంగంగా ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారంటే.., ఎవరి అండ చూసుకొని ఈ అక్రమ దందా నడిపిస్తున్నారో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంచిర్యాల ఎంఎల్‌ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు తన నియోజక వర్గంలో అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని చెబుతున్నప్పటికి ఈ దందాను ఎవరు ప్రోత్సహిస్తున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఎంఎల్‌ఏ మాటలు పట్టించుకోకుండా కాంట్రాక్టరే ఈ దందా నిర్వహిస్తున్నాడా..? అధికారులు ప్రోత్సహంతోనే ఇది జరుగుతుందా..? తెలియాల్సి ఉంది. ఏదీ  ఏమైనప్పటికి అక్రమ మట్టిదందాపై నియోజక వర్గ బాస్ తో పాటు సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులను సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం.


మరిన్ని వార్తలు