ఆస్తి చర్చల వేళ బిగ్ బీ ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

14-11-2026 | 04:12pm

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఒక్కోసారి అభిమానులను ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా ఆయన తన బ్లాగ్‌లో పంచుకున్న ఓ ఆసక్తికరమైన విషయంపై చర్చ మొదలైంది. జీవితంలో మనిషి కోరికలు, ఆశలు, వాటిని అందుకున్న తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి తనదైన శైలిలో వివరించారు.మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎన్నో కావాలని కోరుకుంటామని, ఏదో ఒకటి దొరికితే చాలనుకుంటామని అమితాబ్ అభిప్రాయపడ్డారు. అయితే దేవుడి దయతో మనం కోరుకున్నదానికంటే ఎక్కువ లభించినప్పుడు మాత్రం మరో రకమైన ఆలోచనలు మొదలవుతాయని చెప్పారు.

'మనం ఏదైనా పొందలేనప్పుడు దాని కోసం అడుగుతూనే ఉంటాం. ఏదో ఒకటి దొరికితే చాలని భావిస్తాం. కానీ దేవుడి దయతో అనుకున్నదానికంటే ఎక్కువ వచ్చినప్పుడు.. ఇంత వచ్చిందేంటి? వీటన్నింటినీ ఏం చేయాలి? అని ఆలోచిస్తాం. ఇదే జీవిత సత్యం. అడగకుండానే అన్నీ వస్తున్నప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది. మనం దేవుడిని అడుగుతాం.. కానీ ఇంత ఎక్కువ కాదు' అనే భావాన్ని తన బ్లాగ్ ద్వారా వ్యక్తం చేశారు.

అంతేకాదు, ప్రపంచం మొత్తం మనం అనుకున్నట్లుగా నడవదని బిగ్ బీ చమత్కరించారు. మనం పరుగెత్తి ప్రపంచాన్ని అందుకోగలిగితే మంచిదేనని, అలా చేయలేకపోతే జీవితాంతం వెనుకబడే ఉంటామని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లో జీవిత వాస్తవికత, మనిషి ఆలోచనా విధానంపై ఓ సందేశం కనిపిస్తోంది.మరోవైపు అమితాబ్ కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారాలపై ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలను ఆస్తి వివాదానికి నేరుగా ముడిపెట్టినట్లు అమితాబ్ ఎక్కడా వెల్లడించలేదు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) చర్చనీయాంశంగా మారాయి. జీవితంలో ఆశలకు అంతం లేదని, ఉన్నదానితో సంతృప్తి చెందడం కూడా ముఖ్యమని బిగ్ బీ చెప్పిన మాటలపై అభిమానులు స్పందిస్తున్నారు.

మరిన్ని వార్తలు