పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ ఎస్పీ
చేగుంట నవంబర్ 03, (విజయక్రాంతి): చేగుంట పోలీస్ స్టేషన్ ను జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్(SP Vikrant Kumar Singh) మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి, ఫిర్యాదుల స్వీకరణ, స్టేషన్ రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, నేర నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం స్వీకరించి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చేగుంట ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టు కేసుల్లో సమర్థమైన ఫాలోఅప్ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ వెంకట్ రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్య కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.