యువత అన్ని రంగాలలో రాణించాలి

03-11-2026 | 07:14pm

కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, (విజయక్రాంతి): యువత అన్ని రంగాలలో ముందుండాలని, దేశ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా యువజన క్రీడల శాఖ(District Youth and Sports Department) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026లో పాల్గొనీ మాట్లాడారు.

జిల్లా స్థాయి యువజనోత్సవాలలో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకాలు, చిత్రలేఖనం, కవితా పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలలో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని, ఇలాంటి పోటీలు యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

జిల్లా స్థాయిలో ఆయా విభాగాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మాట్లాడుతూ యువతలోని సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. యువతీ యువకులు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మాట్లాడుతూ జిల్లా స్థాయి యువజనోత్సవాలలో పాల్గొంటున్న విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించాలని ఆకాంక్షించారు. యువత తమలోని నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అధికారులు, సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా సేవలందించిన యువజన సంఘాల ప్రతినిధులను సన్మానించారు. అనంతరం వివిధ కేటగిరీలలో పోటీలలో పాల్గొని మొదటి మూడు స్థానాలలో నిలిచిన విజేతలకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి, షెడ్యూల్డ్ కులములు అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి అంజయ్య, జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి రవికృష్ణ, సంబంధిత అధికారులు, యువతీ, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు