వైభవంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
పాపన్నపేట,నవంబర్27: మండల కేంద్రం పాపన్నపేటలోని సాయిబాబా ఆలయం(Sai Baba Temple) 17వ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ, నవీన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 లీటర్ల ఆవు పాలతో సాయిబాబాకు ఘనంగా అభిషేకం నిర్వహించారు.
అనంతరం పట్టు వస్త్రాలతో సాయిబాబాను సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సాయిబాబాను పల్లకిలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.