వనదుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 11 నుంచి దేవి శరన్నవరాత్రోత్సవాలు..

07-10-2026 | 02:53pm

15న బోనాలు, 19న సువాసిని పూజ, చండీ హోమం

పాపన్నపేట,అక్టోబర్07: దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం( Edupayala Vanadurga Mata Temple).. మంజీరా ఏడు పాయలుగా చీలి ప్రవహించే ప్రాంతం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఈ నెల 11న ఆదివారం నుంచి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీరేశం, అర్చకులు తెలిపారు.

ఆలయ ఆవరణలో ఉన్న గోకుల్ షెడ్ లో ఉత్సవాలు నిర్వహించేందుకు షెడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆదివారం ఉదయమే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.

మొదటి రోజైనా ఆదివారం పాడ్యమిని పురస్కరించుకొని బాల త్రిపుర సుందరి దేవి (ముదురు పసుపు) రూపంలో దర్శనమిస్తుందని, 12న గాయత్రీ దేవిగా (గులాబీ), 13న అన్నపూర్ణాదేవిగా (నీలం), 14న కూష్మాండదేవిగా (ఆకుపచ్చ), 15న మహాలక్ష్మి దేవిగా (పెసర), 16న సరస్వతి దేవిగా (తెలుపు), 17న లలితా త్రిపుర సుందరి  దేవిగా (నారింజ), 18న దుర్గాదేవిగా (ఎరుపు), 19న మహిషాసుర మర్థిని దేవిగా (మెరూన్), 20న చివరి రోజు విజయదశమిని పురస్కరించుకొని రాజరాజేశ్వరి సహిత వనదుర్గాదేవిగా (పసుపు) దర్శనం ఇస్తారని వారు తెలిపారు.

ప్రతిరోజు ప్రాతఃకాల సమయాన అమ్మవారికి అభిషేకం, ఉదయం విఘ్నేశ్వర పూజ తదితరాలు నిర్వహిస్తామని తెలిపారు. 15న వనదుర్గామాతకు అంగరంగ వైభవంగా బోనాలు, 19న సువాసిని పూజ, చండీ హోమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనదుర్గా అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. భక్తులు ఇట్టి కార్యక్రమాలకు అధిక సంఖ్యలో పాల్గొని వనదుర్గా మాత కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు