ఉరి వేసుకుని ఆత్మహత్య
పాపన్నపేట,నవంబర్13: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య(Suicide of a person) చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud) కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలనింగని సాయిలు(37) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై సరిగ్గా పని చేయడం లేదు. రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు.
ఈ విషయంలో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుండేవి. ఈనెల 10న భార్య మమతను తిట్టడంతో ఆమె వారి పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో సాయిలు, మమత ఇటీవల ఓ వద్ద పని చేయగా అక్కడ కూలీ డబ్బులతో సైతం మద్యం సేవించాడు. దీంతో భార్య అతనికి ఫోన్ చేసి ఇలా మద్యం తాగితే ఎలా.. మద్యం తాగడం మానుకో అని చెప్పగా భార్యను తిట్టి ఫోన్ పెట్టేశాడు.
ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయిలుకు భార్య ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో చుట్టూ పక్కల వారు వెళ్లి చూడగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి, భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.