రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి
రహదారిపై హెచ్చరిక సూచికలు లేకుండా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు: ఎస్ఐ బాలరాజు
గంభీరావుపేట, నవంబర్ 13 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్(Gambhiraopet Police Station) పరిధిలోని రాజేశ్వర్రావు కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ జావేద్ హుస్సేన్ (35) అనే యువకుడు మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 12న సాయంత్రం సిరిసిల్ల నుంచి సముద్రలింగాపూర్ వైపు ద్విచక్ర వాహనంపై ఎస్కే టిప్పు సుల్తాన్ సయ్యద్ జావేద్ హుస్సేన్ (35) ప్రయాణిస్తున్నారు.
ఈ క్రమంలో రాజేశ్వర్రావు కాలనీ సమీపంలో రహదారిపై ఎలాంటి లైట్లు, హెచ్చరిక సూచికలు లేకుండా నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని వారి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న జావేద్ హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేట ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
రహదారులపై ట్రాక్టర్లు, ఇతర వాహనాలను నిలిపే సమయంలో తప్పనిసరిగా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ ఆర్. బాలరాజు సూచించారు. ఎలాంటి హెచ్చరిక సూచికలు, రేడియం స్టిక్కర్లు లేకుండా రహదారిపై వాహనాలను నిలిపితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.