రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

13-11-2026 | 05:24pm

నిర్మల్ నవంబర్ 13 ( విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల(Road accidents) నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు.     

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రహదారి ప్రమాదాలు పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు సంబంధిత అధికారులంతా కలిసి పని చేయాలన్నారు. బ్లాక్ స్పాట్ లు గుర్తించి, ఆ ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. వేగ నియంత్రణలు, సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. రహదారుల వెంబడి అక్రమంగా వాహనాలు నిలిపితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోడ్లపై పశువులు సంచరించకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పశువులు రోడ్లపైకి వదిలే యజమానులకు జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. అవసరమైతే పశువులను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు.

రోడ్ల వెంబడి ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నారు సమావేశంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు తమ శాఖ పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు నిర్వహించి, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్, హెల్మెట్ లేని డ్రైవింగ్ చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలన్నింటికీ పోలీసు శాఖ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.  

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ రాజేందర్, ఈఈ ఆర్ అండ్ బి సుభాష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు