శ్వాస తీసుకోవడమే భారంగా మారుతున్న జవహర్ నగర్ ప్రజల జీవనం
డంపింగ్ యార్డ్... ఎత్తివేతే లక్ష్యంగా కార్యాచరణ..
టియు జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి..
రిలే నిరాహార దీక్షలకు సిజెపి మద్దతు..
నాల్గవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు..
జవహర్ నగర్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఉప్పెనలా సాగుతున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) వ్యతిరేక పోరాట ఉద్యమం రోజు రోజుకు బలీయమైన ఒక మహా శక్తి ఉద్యమంగా సాగుతూ రిలే నిరాహార దీక్షాస్థలి డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా కొనసాగుతుందని టియు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి పేర్కొన్నారు.
కాలుష్య కాసారంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలని డంపింగ్ భూతానికి బలైన జవహర్ నగర్ ను అన్ని విధాల ఆదుకోవాలని టి యు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తాలో డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని టియు జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు ప్రపుల్ రామిరెడ్డి హాజరై రిలే నిరాహార దీక్షలకు మద్దతు ప్రకటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కారణంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయని తాగునీరు సాగునీరు విషతుల్యంగా మారిందని తెలిపారు. కాలుష్య ప్రభావంతో ఇక్కడి ప్రజల సగటు ఆయు ప్రమాణం తగ్గిపోయి 60 ఏళ్ళు నిండకముందే మృత్యువాత పడుతున్నారని ఇటీవల కాలంలో సుమారుగా ఆరుగురు మరణించడం బాధాకరమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ వెంటనే తరలించి జవహర్ నగర్ వాసులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు: ఈ కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. పార్టీ నాయకులు సునీల్ ధర్పల్లి, శ్రవణ్ ,రంగసాయి రెడ్డి ప్రవీణ్ తదితరులు రిలే దీక్ష శిబిరానికి వచ్చి సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ దర్శనం యాదగిరి, డి. స్వరూప, రాజ్ కుమార్ సామల మనమ్మ పుష్ప సిహెచ్ ఎల్లయ్య బీ మల్లికా టీ మాధవి జయక్క రాజు రాణి వేముల యాదగిరి రాజనర్సింహ మోజస్ జావేద్ మబ్బు బాలు, గబ్బిలాల పేట వాసులు చింత ఎల్లేష్ శ్రీనివాస్ నాగలింగం, కొన్నే వేణు తదితరులు పాల్గొన్నారు.