చెత్త రాజకీయం!
- జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై పార్టీలది తలోదారి
- రాజకీయ లబ్ధికే పాకులాట.. ప్రజారోగ్యంతో చెలగాటం
- అప్పట్లో పునాది వేసిన కాంగ్రెస్.. నేడు నిర్లిప్తత
- నాడు ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యంతరం
- కేంద్రంలో అధికారంలో ఉన్నా సమష్టిగా స్పందించని బీజేపీ ఎంపీలు
- మూడు పార్టీల తీరుపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం
చెత్త సమస్యతో ప్రజల బతుకులు ఛిద్రమవుతుంటే.. రాజకీయ పార్టీలు మాత్రం అందులోనూ మైలేజీ వెతుక్కుంటున్నాయి. సుమారు 40 లక్షల మంది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై మూడు ప్రధాన పార్టీలు మూడు రకాలుగా వ్యవహరిస్తున్నాయి. యార్డుకు పునాది వేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారంపై కాలయాపన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది.
అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అక్కడ యార్డుల ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. బీజేపీ నేతలు పాదయాత్రలు, ప్రకటనలతో సమస్యను ప్రస్తావిస్తున్నా.. ఆశించిన స్థాయిలో సమష్టి కార్యాచరణ లేదన్న విమర్శలున్నాయి. వెరసి.. రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న మూడు పార్టీలపై ప్రజాగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. తమకు న్యాయం జరిగేది ఎప్పుడంటూ పాలకుల బాధ్యతారాహిత్యాన్ని నిలదీస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawaharnagar Dumping Yard) విషయంలో మూడు ప్రధాన పార్టీలు మూడు దారుల్లో వెళ్తున్నాయి. కానీ బాధితుల సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభంది. హైదరాబాద్ నగరంలోని చెత్తను తరలించి నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్ కాలక్రమేణా పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర సమస్యగా మారింది. చెత్త గుట్టలు, దుర్వాసన, భూగర్భ జలాల కాలుష్యం, గాలి కాలుష్యం వంటి సమస్యలు స్థానికుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి.
వేలాది మంది క్యాన్సర్, చర్మరోగాలు, అసలు ఇప్పటి వరకు నిర్ధారించని వ్యాధులతో పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. డంపింగ్ యార్డ్‌కు ప్రత్యామ్నాయంగా నాలుగు ప్రాంతాల్లో భూములను గుర్తించింది. ప్యారానగర్లో సుమారు 120 ఎకరాలు, సిద్ధాపూర్లో సుమారు 86 ఎకరాలు, బండి ర్యావిర్యాలలో సుమారు 400 ఎకరాలతో పాటు లక్డారం, తదితర ప్రాంతాల్లోనూ ఎక్కడికక్కడ డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలని ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేశారు.
అయితే వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ఫలితంగా జవహర్‌నగర్‌పై చెత్త భారం కొనసాగుతూనే ఉంది. ప్పట్లో ప్రత్యామ్నాయ ప్రాంతాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తే.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే ఆయా ప్రాంతాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ప్రజాసంఘాలు, జేఏసీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నాడు పోరాటం.. నేడు మౌనం
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌కు వ్యతిరేకంగా గతంలో కాంగ్రెస్ నేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గళమెత్తారు. డంపింగ్‌యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, దమ్మాయిగూడ జేఏసీ ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. అప్పట్లో ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకుడు..
ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, నిర్లిప్తత వీడి కోర్టు ఆదేశాల అమలుకు చొరవ చూపాలన్న డిమాండ్ బాధితుల నుంచి వినిపిస్తోంది.
ఎంపీ పాదయాత్రతో సమస్య తీరుతుందా?
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి ఆ పార్టీ నేతలు బాధ్యతాయుతంగా కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని అధికారాలు, నిబంధనల మేరకు సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. అయినా సరైన చొరవ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టడం స్వాగతించదగిన పరిణామమే. అయితే పాదయాత్రతోనే సమస్య పరిష్కారం కాదు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నందున సంబంధిత శాఖలతో మాట్లాడి, కేంద్రం నుంచి అవసరమైన నిధులు తీసుకురావడం, పర్యావరణ సంస్థల ద్వారా చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకురావడం కూడా ఆయన బాధ్యతే. ప్రజలు కోరుకుంటున్నది పాదయాత్రలు కాదు, తమ సమస్యకు పరిష్కారం.
బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి!
బీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా విమర్శలకు తావిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలోనే ప్రత్యామ్నాయ డంపింగ్ యార్డుల కోసం నాలుగు ప్రాంతాల్లో భూములను గుర్తించారు. కానీ, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు వద్దంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం, బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపాలంటే ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక, పర్యావరణ అనుమతులు, స్థానిక ప్రజల అభిప్రాయాలు, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ విధానాలపై స్పష్టమైన నిర్ణయం అవసరం. కానీ ఈ అంశాలపై సమగ్ర చర్చ జరగాల్సిన చోట రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకే ప్రాధాన్యం లభిస్తోంది.
మూడు పార్టీల చేతుల్లో అధికారం.. ప్రజలకు మాత్రం కష్టాలే
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన చామకూర మల్లారెడ్డి ఉన్నారు. అదే ప్రాంతానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అంటే సమస్య పరిష్కారానికి అవసరమైన రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర స్థాయి అధికార వ్యవస్థలు అందుబాటులోనే ఉన్నాయి.
మూడు పార్టీలకు ప్రజల సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ నియంత్రణ సంస్థల ద్వారా పర్యవేక్షణను బలోపేతం చేయవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధులు, గత పాలకులు ప్రత్యామ్నాయ భూముల అంశంపై బాధ్యతాయుతంగా వ్యవహరించవచ్చు. కానీ ఈ సమన్వయం కనిపించడం లేదు. ఎవరికి వారు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు.
సమాధానం చెప్పేదెవరు?
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ప్రభావం కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. చుట్టుపక్కల 40 నుంచి 50 గ్రామాలకు చెందిన సుమారు 40 లక్షల మంది ప్రజలు ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి, నీరు, నేల కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంది. మరోవైపు దుర్వాసన, దోమలు, ఇతర పర్యావరణ సమస్యలతో జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.
ప్రజా సమస్యలపై పోరాడాల్సిన రాజకీయ పార్టీలు.. ప్రజల బాధలను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చుకుంటే పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది? ఒక పార్టీ మరొక పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపడం వల్ల ప్రజలకు ఉపశమనం లభిస్తుందా? పాదయాత్రలు, ధర్నాలు, ఆరోపణలు, రాజకీయ ప్రకటనలతో కాలుష్యం తగ్గుతుందా? డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా?
పాదయాత్రలు కాదు.. ఆరోగ్యకరమైన జీవనం
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలి. కోర్టు ఆదేశాలను అమలు చేయాలి. ప్రత్యామ్నాయ ప్రాంతాలపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి, స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిధులు కేటాయించి, ఆధునిక వ్యర్థ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
అప్పటివరకు కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలి. నాలుగు దశాబ్దాల రాజకీయాలు చేసినా, నాలుగు రోజుల పాదయాత్రలు చేసినా ప్రజలకు కావాల్సింది మాత్రం ఆరోగ్యకరమైన జీవనం. 40 నుంచి 50 గ్రామాల ప్రజల కష్టాలు, కన్నీళ్లకు పరిష్కారం ఎప్పుడు? ఎవరి చొరవతో? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి బాధితుడి మనసులో మెదులుతున్నాయి. మూడు పార్టీలు తమ బాధ్యతలను విస్మరిస్తూ ఇదే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడితే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరగడం ఖాయం.
అఖిలపక్షంతో జేఏసీ ఏర్పాటు చేశాం
అనేక సంవత్సరాలుగా జవహర్‌నగర్ డం పింగ్ యార్డ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్‌ను ఎ త్తివేయాలని, చెత్త తరలింపును నిలిపివేయాలని ఇక్కడి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అం దుకే అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో దమ్మాయిగూడ జేఏసీ ఏర్పడింది. జేఏసీ తరఫున మేము చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లాం. చెత్త తరలింపును నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదు.
పరిష్కారం చూపే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మూడేండ్లు అయినా స్పందించడం లేదు. మరోవంక బీఆర్ఎస్ చూపించిన ప్రత్యామ్నా య ప్రదేశాల్లోని ప్రజలను బీఆర్ఎస్ నేతలే రెచ్చగొట్టి అడ్డుకుంటున్నారు. ఇక కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ.. ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసు కుంటున్నారు తప్ప.. ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకోవడం లేదు.
డాక్టర్ శంకర్‌నారాయణ,
దమ్మాయిగూడ జేఏసీ చైర్మన్
సమస్య తీర్చకపోతే పార్టీలెందుకు?
అన్ని పార్టీల నేతలు ప్రజలకు సంఘీభా వం తెలుపుతున్నాయి. కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. తమ బాధ్యత కాదంటే తమది కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఎవరి బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారపక్షంలోకి వచ్చిన తరువాత నిర్లిప్తత కనపడుతోంది. గతంలో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. స్థాని క ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెందిన మల్లారెడ్డి, ఎంపీ బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ ఉ న్నారు. ఒకరిపై ఒకరు విమర్శించుకోవడమే సరిపోతుంది. అన్ని రాజకీయ పార్టీలు, నేత లు ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవ డం లేవు. ఎవరికివారు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం సమస్యను సాగదీస్తున్నా రు. దీనికి వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనకపోతే.. ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.
కో కన్వీనర్, జవహర్‌నగర్
డంపింగ్‌యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ