ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అర్జున్ సినిమాకు శ్రీకారం
పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ ఘటనల స్ఫూర్తితో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో(Director Action King Arjun Sarja) ఓ సినిమా రూపొందుతోంది. దీన్ని ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అనూప్ మోహన్ నిర్మించనున్నారు. అర్జున్ సర్జా కెరీర్లో 175వ సినిమాగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. ఈ బహుభాషా చిత్రం సమకాలీన భారత చరిత్రలోని ఒక కీలక ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది.
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటైన అయోధ్యలో ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు, ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, విశిష్ట అతిథులు హాజరయ్యారు. అర్జున్ సర్జా తన భార్య నివేదిత అర్జున్తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో ప్రారంభ పూజ జరుపుకున్న మొదటి చిత్రమిదేనని, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని చిత్రబృందం పేర్కొంది.
ఈ చిత్రంలో దర్శకుడిగా, ప్రధాన నటుడిగా ద్వంద్వ బాధ్యతల్ని అర్జున్ సర్జా నిర్వర్తించనున్నారు. విశ్రాంత భారత సైనికాధికారి మేజర్ విజయ్ భార్గవ్ రాసిన స్క్రీన్ప్లే ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలం. ప్రధాన హిందీ భాషా చిత్రంగా రూపొందించబడిన ఈ సినిమాను తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2027, ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది.