మార్వెల్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

28-10-2026 | 02:22pm

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పిన ‘అవెంజర్స్: డూమ్స్ డే’ భారతీయ ప్రేక్షకులను ఒకరోజు ముందుగానే అలరించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 17, 2026న ఇండియన్ థియేటర్లలో విడుదల కానుండగా, అంతర్జాతీయ విడుదల తేదీ డిసెంబర్ 18గా ప్రకటించారు.

డాక్టర్ డూమ్‌గా డౌనీ జూనియర్.. స్టీవ్ రోజర్స్‌గా క్రిస్ ఎవాన్స్

ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనుండగా, క్రిస్ ఎవాన్స్ మరోసారి స్టీవ్ రోజర్స్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. వీరిద్దరి కలయిక సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ సహా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీపావళి శుభాకాంక్షలతో స్పెషల్ వీడియో

భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. దీపావళి కొత్త ఆరంభాలకు ప్రతీక అని చెబుతూనే, ఈసారి వెలుగు నుంచి చీకటివైపు ప్రయాణం ఉండొచ్చంటూ తమదైన శైలిలో సినిమాపై ఆసక్తిని పెంచారు. చివర్లో ‘అవెంజర్స్: డూమ్స్ డే’లో కలుద్దామంటూ అభిమానులను ఆహ్వానించారు.

మూడు విశ్వాలు.. అంతకుమించిన ప్రమాదం!

విభిన్న విశ్వాలకు చెందిన సూపర్‌హీరోలు ఒకే ప్రమాదాన్ని ఎదుర్కొనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. వారు ఇప్పటివరకు చూడని భయంకరమైన ముప్పును ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, సూపర్‌హీరోల కలయిక, డాక్టర్ డూమ్ పాత్ర చుట్టూ సాగే పరిణామాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. భారతీయ థియేటర్లలో ప్రత్యేక ప్రీమియం ఫార్మాట్లతో పాటు మార్వెల్ ప్రకటించిన ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లోనూ ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 17న థియేటర్లలోకి రానున్న ఈ సూపర్‌హీరో మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు