ఆస్కార్ దాకా పంకజ ప్రయాణం ఇలా..!
- విద్యార్థి ప్రాజెక్టుగా మొదలై.. ప్రతిష్టాత్మక అవార్డుల బరిలోకి..
- లఘుచిత్రానికి ఆస్కార్ నామినేషన్ దక్కేనా?
- తెలుగు మూలాలున్న ఇద్దరు యువతుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు
తెలుగు మూలాలున్న ఇద్దరు యువతులు రూపొందించిన కన్నడ- లఘుచిత్రం ‘పంకజ’(Kannada Short Film Pankaja) ఇప్పుడు అంతర్జాతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిష్ఠాత్మక 99వ ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించడంతో ఈ సినిమా పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఒక సాధారణ విద్యార్థి ప్రాజెక్టుగా మొదలైన ఈ ప్రయాణం.. అంతర్జాతీయ వేదికల నుంచి ఆస్కార్ బరిలోకి చేరడం విశేషం. కేవలం 14 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఆస్కార్ బరిలోకి చేరడం ద్వారా భారతీయ సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేకతను చాటుకున్నట్టయింది. హాలీవుడ్ దిగ్గజాలు స్పైక్ లీ, విలెం డఫోతో పాటు భారతీయ ఆస్కార్ విజేత నిర్మాత గునీత్ మోంగా కపూర్ ఈ చిత్రానికి అండగా నిలవడం మరో విశేషం.
ఏమిటీ ‘పంకజ’ కథ?
బెంగళూరులోని ఓ మురికివాడలో నివసించే పంకజ అనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన భర్త కనిపించకుండా పోవడంతో అతడి ఆచూకీ కోసం తన చిన్నారి కుమార్తె లల్లితో కలిసి ఆమె అన్వేషణ ప్రారంభిస్తుంది. భర్త కోసం వెతికే క్రమంలో ఆమెకు ఎదురయ్యే సామాజిక, వ్యవస్థాగత సమస్యలు.. సాధారణ ప్రజలు అధికార వ్యవస్థల ముందు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కుటుంబాల జీవితాలు, వారి వెనుక మిగిలిపోయే మహిళల బాధలు, తల్లిగా ఒంటరిగా బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులను దర్శకురాలు అనూయ స్వామి సహజంగా చూపించారు. ఒక వ్యక్తి కనిపించకుండా పోతే అతడి కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులేంటి? అధికార వ్యవస్థలు సామాన్యులకు ఎంతవరకు అండగా ఉంటున్నాయి? వంటి ప్రశ్నలను ఈ కథ ప్రేక్షకుల ముందుంచుతుంది.
అండగా స్పైక్ లీ, విలెం డఫో..
‘పంకజ’ ప్రయాణం సన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026లో ప్రపంచ ప్రీమియర్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఇప్పటివరకు 40కి పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితమైనట్లు చిత్రబృందం తెలిపింది. ముఖ్యంగా లండన్‌లో జరిగిన రెయిన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డు గెలుచుకోవడం ఈ చిత్రానికి కీలక మలుపుగా మారింది. ఈ అవార్డుతోనే 99వ ఆస్కార్ అవార్డుల ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో పరిశీలనకు అర్హత సాధించింది.
ఇక ‘పంకజ’ ఆస్కార్ ప్రయాణంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్పైక్ లీ, విలక్షణ నటుడు విలెం డఫో, భారతీయ ఆస్కార్ విజేత నిర్మాత గునీత్ మోంగా కపూర్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్పైక్ లీతో అనూయకు ప్రత్యేక అనుబంధం ఉంది. న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఆమె స్పైక్ లీ వద్ద టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఒకప్పుడు స్పైక్ లీ రూపొందించిన మాసర్ క్లాసులను ఆసక్తిగా చూసిన అనూయ సినిమాకు ఇప్పుడు ఆయనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నారు.
ఆస్కార్ నామినేషన్ దిశగా..
ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించడం అంటే నేరుగా నామినేషన్ దక్కినట్లు కాదు. రెయిన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్లో సాధించిన విజయంతో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో అకాడమీ పరిశీలనకు అర్హత పొందిన ‘పంకజ’.. తదుపరి దశల్లో ఓటింగ్, షార్ట్‌లిస్ట్ ప్రక్రియను దాటాల్సి ఉంటుంది. అయితే, ఒక విద్యార్థి ప్రాజెక్టుగా మొదలైన సినిమా ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం చిన్న విషయం కాదు. సామాన్య మహిళల జీవితాలను అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం అనూయ స్వామి ప్రత్యేకత. ప్రాంతీయ కథలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపిస్తున్న ‘పంకజ’.. ఆస్కార్ నామినేషన్ సాధిస్తుందా? అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
అమ్మతో అనుబంధమే కథకు ప్రేరణ..
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించింది అనూయ స్వామి. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆమె ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లారు. న్యూయార్క్ యూనివర్సిటీలోని ప్రతిష్ఠాత్మక టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ విభాగంలో చదువుతున్న సమయంలో రెండో ఏడాది ప్రాజెక్టుగా ‘పంకజ’ను రూపొందించారు. ఈ కథకు తన తల్లితో ఉన్న అనుబంధం, చిన్నతనంలో బెంగళూరులో చూసిన కార్మిక కుటుంబాల జీవితాలు ప్రేరణగా నిలిచాయని అనూయ వెల్లడించారు.
న్యూయార్క్‌లో ఇసుక తవ్వకాలపై ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనను చూసినప్పుడు కార్మిక రంగాల్లో పురుషులే ఎక్కువగా కనిపిస్తున్నారని, వారి వెనుక ఉన్న మహిళల జీవితాలు ఎక్కడున్నాయనే ప్రశ్న తనలో మొదలైందని ఆమె తెలిపారు. ఆ ఆలోచన నుంచే ఈ కథకు బీజం పడిందని చెప్తారు దర్శకురాలు అనూయ. బెంగళూరును కేవలం సంప్రదాయ నగర చిత్రణకు పరిమితం చేయకుండా, తాను చూసి పెరిగిన ప్రాంతాలను సహజంగా చూపించాలన్నది తన ప్రయత్నం అని చెప్తారామె. అందుకే నిజమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపి, స్థానిక కళాకారులకు ఆమె ప్రాధాన్యమిచ్చారు.
ప్రధాన పాత్రలో హర్షిణి బోయళ్ల..
ఈ చిత్రంలో పంకజ పాత్రను రంగస్థల నటి హర్షిణి బోయళ్ల పోషించారు. మరో కీలక పాత్రలో పద్మశ్రీ జీ నటించారు. హర్షిణి కూడా బెంగళూరులో పుట్టి పెరిగిన తెలుగు మూలాలున్న నటే. ఓ స్నేహితుడి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఆడవాళ్లతో కలిసి పనిచేయాలన్న ఆసక్తితో ఆడిషన్‌కు హాజరయ్యానని ఆమె వెల్లడించారు. బెంగళూరులో చిత్రీకరణ కోసం ప్రాంతాలను పరిశీలించే సమయంలో అక్కడి మహిళల జీవితాలను దగ్గరగా గమనించడం తన పాత్రకు ఎంతో ఉపయోగపడిందని హర్షిణి తెలిపారు. భర్తలు వదిలివెళ్లిన తర్వాత కూడా పిల్లలను చూసుకుంటూ, పనులు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళల కథలు తనను ప్రభావితం చేశాయని చెప్పారు.