మిరప పంటలో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి!

16-10-2026 | 12:01pm

పంట మార్పిడితో మెరుగైన దిగుబడి

ములుగు,(విజయక్రాంతి): మిరప పంటలో చీడపీడలను సమర్థంగా నివారించి, నాణ్యమైన దిగుబడితో పాటు రైతులకు మెరుగైన ఆదాయం లభించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని డివిజనల్ ఉద్యానవన శాఖ అధికారి శ్రీకాంత్ సూచించారు. తక్కువ పురుగుమందుల వినియోగంతో సురక్షితమైన పంట ఉత్పత్తి సాధించేలా ఉద్యానవన శాఖ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తుందని తెలిపారు.

శుక్రవారం ఆయన పలు గ్రామాల్లోని మిరప పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మిరప సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల నివారణ చర్యలను వివరించారు. ఆరోగ్యవంతమైన, తెగుళ్లు లేని నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని శ్రీకాంత్ సూచించారు. నర్సరీలో ఎత్తైన మడులను ఏర్పాటు చేసి, నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో 50 శాతం షేడ్‌నెట్‌ను ఉపయోగించి, మొక్కలకు అవసరమైన నీటిని అందించాలని తెలిపారు.

నేల పరీక్ష చేయించి, ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. బాగా కుళ్లిన పశువుల ఎరువు, కంపోస్టును ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా కాయలు ఏర్పడే దశలో నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

మల్చింగ్‌ విధానంతో నేలలో తేమను కాపాడవచ్చని, నీటి ఆవిరిని తగ్గించడంతోపాటు నేల ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చని వివరించారు. దీనివల్ల కలుపు మొక్కల పెరుగుదలను కూడా తగ్గించవచ్చన్నారు. నత్రజని ఎరువులను అధికంగా వాడకుండా, పొటాషియం సహా ఇతర పోషకాలను సమతుల్యంగా అందించాలని సూచించారు.

మిరప కాయ తొలుచు పురుగు వంటి చీడపీడల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించాలని శ్రీకాంత్ తెలిపారు. ఆకులు ముడుచుకుపోవడం, వెండి రంగు మచ్చలు కనిపించడం, కొత్త ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా వికృతంగా పెరగడం వంటి లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన సమగ్ర చీడపీడల యాజమాన్య చర్యలు చేపట్టాలన్నారు.

పంట ప్రారంభ దశ నుంచే పొలాన్ని కలుపు మొక్కలు లేకుండా ఉంచాలని సూచించారు. పురుగుల ఉధృతి ప్రారంభ దశలో వేప ఆధారిత వృక్ష సంబంధ ఉత్పత్తులను అవసరాన్ని బట్టి వినియోగించాలన్నారు. పుష్పించే దశలో తేనెటీగలు, ఇతర పరాగసంపర్క కీటకాలకు హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వరుసగా ఒకే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని శ్రీకాంత్ సూచించారు. దీనివల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు కొన్ని చీడపీడలు, తెగుళ్ల సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తూ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు