మహిళల అభ్యున్నతికి బంగారు

18-11-2026 | 04:27pm
  1. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు
  2. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
  3. మంత్రి సీతక్క వెల్లడి 

ములుగు, నవంబర్ 18 (విజయక్రాంతి) : మహిళలు ఆర్థికంగా(Women and Finance) స్వావలంబన సాధించేలా స్వయం సహాయక సంఘాల(Self-help groups) ద్వారా విస్తృతంగా స్వయం ఉపాధి అవకాశాలు(Self-employment opportunities) కల్పించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు('Cheyutha' Pensions) అందించి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Seetakka) తెలిపారు. బుధవారం ములుగు జిల్లా(Mulugu District) మల్లంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక సర్పంచులతో కలిసి లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నూతన చేయూత పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన సుమారు 4.60 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు నెలవారీ పింఛన్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని, అర్హత ఉండి ఇప్పటివరకు పింఛన్లు మంజూరు కాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత మేరకు పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి ఆర్థికంగా ఎదిగేలా స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు తమకు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు బంగారు బాట వేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఒక్కో మహిళా సంఘానికి 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

మల్లంపల్లి మండలంలోని మహిళా సంఘాలకు 20 కోట్ల మేర రుణాలు అందించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలకు మహిళా సంఘాలు అండగా నిలుస్తున్నాయని, సంఘాల్లో లేని మహిళలు కూడా సభ్యత్వం పొంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. మేడారం జాతర సందర్భంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. సుమారు 550 నుంచి 600 మంది మహిళలు వ్యాపారాలు చేసేందుకు ముందుకు రాగా, వారికి సుమారు 3 కోట్ల రుణాలు అందించినట్లు పేర్కొన్నారు.

జాతర సమయంలో ఆ మహిళలు సుమారు రూ.9 కోట్ల మేర వ్యాపారం నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలు, ఇతర ఉత్సవాల సమయంలో కూడా మహిళలు వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా మహిళలు ఏర్పాటు చేస్తున్న చిన్న దుకాణాలను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. మల్లంపల్లి మండల పరిధిలోని 10 గ్రామ పంచాయతీల్లో మొత్తం 215 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. మల్లంపల్లి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు దుకాణాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.

మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందేందుకు బ్యాంకుల సహకారంతో 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. మల్లంపల్లి మండలంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన పింఛన్లలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించినట్లు పేర్కొన్నారు. నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా కుటుంబం ఎంపిక చేసుకున్న సభ్యుడు ఏ కారణంతోనైనా మరణించిన సందర్భంలో పథకం నిబంధనల ప్రకారం బాధిత కుటుంబానికి 5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, డీఆర్డీఓ చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు