జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్ ల ఆధునికరణ...
-- విద్యుత్ సరఫరా సామర్థ్యం పెంచడమే లక్ష్యం
-- టీజీ ఎన్ పి డి సి ఎల్ ఎస్ ఇ బిక్షపతి
ములుగు, నవంబర్ 16 (విజయక్రాంతి): ములుగు సర్కిల్ పరిధిలో 25 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను దశలవారీగా ఆధునికీకరించి, వాటి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(Telangana Northern Electricity Distribution Company) ప్రత్యేక చర్యలు చేపడుతోందని సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత సబ్స్టేషన్లలో కాలక్రమేణా అరిగిపోయిన, తుప్పుపట్టిన పరికరాలను గుర్తించి వాటి స్థానంలో నూతన పరికరాలను ఏర్పాటు చేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సబ్స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 25 సబ్స్టేషన్ల ఆధునికీకరణ పనులు పూర్తిచేయగా 6 సబ్స్టేషన్లలో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
వేసవికాలంలో, వ్యవసాయ విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సమయాల్లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ఆధునికీకరణ పనులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పాత పరికరాల స్థానంలో నూతన పరికరాలను ఏర్పాటు చేయడం వల్ల సబ్స్టేషన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.విద్యుత్ అంతరాయాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సూపరింటెండింగ్ ఇంజనీర్ పేర్కొన్నారు.