హైదరాబాద్‌లో గజగజ
తెలంగాణలో చలి పంజా.. 11.4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి గాలులతో రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు)లో అత్యల్పంగా 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం పెరిగి కొన్ని ప్రాంతాల్లో 13.4 డిగ్రీలకు టెంపరేచర్లు పడిపోయాయి.
ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానిలో 12, కెరమెరిలో 13.3, వాంకిడిలో 13.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాప్రా, చార్మినార్‌లో 13.4, పటాన్చెరులో 13.8, అమీర్‌పేట, శేరిలింగంపల్లిలో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నగరంలో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. GHMC పరిధిలో మరో 10 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అంచనా.
మరోవైపు ఉదయం వేళల్లో పొగమంచు (Fog) కమ్ముకోవడంతో రహదారులపై ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. బస్ స్టేషన్లలోనూ ఉదయం ప్రయాణికుల రద్దీ తగ్గుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబర్ 20 తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసి చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.