కౌశిక్ రెడ్డికి హైకోర్టులో షాక్
హైదరాబాద్: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో చుక్కెదురైంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు వాయిస్ శాంపిల్(Voice Sample) సేకరించేందుకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్(Karimnagar Police Commissioner)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వీణవంక పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy)పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన గొంతు నమూనాలను సేకరించి, సంబంధిత ఆడియో, వీడియో రికార్డులతో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు.
అయితే వాయిస్ శాంపిల్ సేకరణను వ్యతిరేకిస్తూ కౌశిక్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు తాజాగా ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో దర్యాప్తులో భాగంగా పోలీసులు వాయిస్ శాంపిల్ సేకరించేందుకు మార్గం సుగమమైంది.