'అక్వాన్' అలజడి.. ఈ జిల్లాలకు అలర్ట్

16-11-2026 | 07:22am

తెలంగాణలో భారీ వర్షాలు.. అక్వాన్ తుపానుతో వాతావరణ శాఖ అలర్ట్!

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 'అక్వాన్' తుపానుగా బలపడుతుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు Weather Alert జారీ అయింది. ముఖ్యంగా నవంబర్ 20, 21 తేదీల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో నవంబర్ 21, 22 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది.

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం వేగంగా బలపడుతోంది. నవంబర్ 16 నాటికి తుపానుగా, 17న తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుపానుగా బలపడితే గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 18 నుంచి వర్షాలు ప్రారంభమై 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కుండపోత వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, రైతులు కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవాలని అధికారులు సూచించారు. తుపాను గమనం మారే అవకాశం ఉన్నందున ప్రజలు తాజా Weather Updates గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు