కోటగుళ్లలో కార్తీక సోమవారం భక్తుల సందడి
ప్రత్యేక పూజలు నిర్వహించిన అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సర్పంచ్ రాధిక శ్రీనివాస్
గణపురం, నవంబర్ 16 (విజయక్రాంతి): కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని చారిత్రక కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి(Additional Collector Vijayalakshmi), గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, ఎంపీడీవో ఎల్. భాస్కర్‌తో పాటు పలువురు అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు తులసి, మారేడు చెట్ల వద్ద దీపాలు వెలిగించి దీపదానం చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.