ప్రజావాణికి పోరు.. కార్యాలయాలకు రారు

16-11-2026 | 01:31pm

సమయం 11 దాటినా సార్లు రారు!

కార్యాలయాల వద్ద పడిగాపులుకాస్తున్న ప్రజలు 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. ఉద్యోగులకు వరం

కార్యాలయాల్లో గాడి తప్పిన సమయపాలన 

ప్రజావాణికి సైతం గైర్హాజరు

పాపన్నపేట: ప్రభుత్వ కార్యాలయానికి ఒకరిద్దరు ఉద్యోగులు ఆలస్యంగా వచ్చారంటే.. ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఏకంగా వివిధ శాఖల అధికారులు, దిగువ స్థాయి ఉద్యోగులందరూ ఉదయం 11 గంటలు దాటినా కార్యాలయానికి రాకపోతే.. తమ పరిస్థితి ఏంటని వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సిబ్బంది వివిధ సమయాల్లో రావడంతో ఇబ్బందుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయం(Papannapet MPDO Office)లో సమయం 11 అవుతున్నా కార్యాలయానికి సిబ్బంది రాకపోవడం గమనార్హం.

 ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం..

అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించకపోవడమనేది ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని, అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

 ప్రజావాణికి గైర్హాజరు..11:30 వరకు తాపీగా చేరుకున్న అధికారులు

 ప్రతి సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సైతం అధికారులు గైర్హాజరవుతున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు శాఖల అధికారులు హాజరుకాలేదు. వచ్చిన అధికారులు సైతం ఒక్కొక్కరుగా 11:30 వరకు తాపీగా చేరుకున్నారు.

మరిన్ని వార్తలు