ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్‌లో భారీ పెరుగుదల...
- వ్యవసాయ అవసరాలు, ఏసీలు, కూలర్ల వినియోగంతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
- నిరంతర విద్యుత్ సరఫరాకు టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు
- ములుగు సర్కిల్ పరిధిలో పలు విద్యుత్ సబ్స్టేషన్లు తనిఖీ చేసిన సీఎండీ వరుణ్ రెడ్డి
ములుగు, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో(Impact of El Niño) ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ విద్యుత్(Agricultural electricity) వినియోగంతో పాటు ఏసీలు, కూలర్ల వాడకం పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
బుధవారం ములుగు సర్కిల్ పరిధిలో పర్యటించిన సీఎండీ కమలాపూర్‌లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు మంగపేట, మల్లూరు, అబ్బాపూర్ 33/11 కేవీ సబ్స్టేషన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం ములుగులోని ఎస్పీఎం షెడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్ల నిర్వహణ, విద్యుత్ పరికరాల పనితీరు, ప్రస్తుత విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు.
రాబోయే సీజన్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు, గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
విద్యుత్‌కు గరిష్ఠ డిమాండ్ ఉండే సమయాల్లో అంతరాయాలను తగ్గించేందుకు, సాధ్యమైన చోట్ల విద్యుత్ లైన్ క్లియరెన్స్ సాయంత్రం వేళల్లోనే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. 11 కేవీ ఫీడర్లపై విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు సంబంధిత సిబ్బంది వెంటనే స్పందించి లోపాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనవసరంగా లైన్ క్లియరెన్స్ లు తీసుకోకూడదని సూచించారు. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను తక్షణమే మార్చి విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నష్టం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీఎండీ వెంట ములుగు సర్కిల్ ఎస్ఈ బిక్షపతి, ములుగు డీఈ రాజు, ఏటూరునాగారం ఏడీఈ తో పాటు ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.