వరద ముంపునకు శాశ్వత పరిష్కారం
- కాప్రా చెరువు ఔట్ లెట్ పనులకు రూ. 5 కోట్లు
- పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో
ఎల్బీనగర్, అక్టోబర్ 14 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ నెలకొన్న వరద ముంపు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికి భారీగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జోనల్ కమిషనర్ వికాస్ మహాతో(Zonal Commissioner Vikas Mahato) తెలిపారు. హరిహరపురం కాలనీలోని కాప్రా చెరువు ఔట్ లెట్ పనులకు ప్రభుత్వం గతంలో రూ, 5 కోట్లు మంజూరు చేసింది.
ఇందులో భాగంగా కుమ్మరికుంట నుంచి మిలేనియం కాలనీ వరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు మిలేనియం కాలనీ నుంచి కాప్రా చెరువు వరకు చేపట్టనున్న పనులకు రూ. 7 కోట్లు మంజూరు దశలో ఉన్నాయి. ఆయా పనులను బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
కాప్రా చెరువు ఔట్ లెట్ పనులు పూర్తయితే దిగువన ఉన్న శాతవాహన నగర్, సాయి గార్డెన్, గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, స్నేహమయి నగర్, అఖిలాండేశ్వరి నగర్, పీవీఆర్ కాలనీ, సామానగర్ ఇతర కాలనీల్లో వరద ముంపు సమస్య శాశ్వతంగా తీరుతుందన్నారు. వచ్చే వర్షాకాలంలోపు ఔట్ లెట్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటిక రెడ్డి అరవింద రెడ్డి, నాయకులు అనిల్ చౌదరి, రాఘవేంద్రరావు, పోగుల రాంబాబు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డులో వ్యర్థాలు పారేస్తే కఠిన చర్యలు
మన్సురాబాద్ డివిజన్ లోని డంపింగ్ యార్డు నుంచి దుర్గంధం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో వ్యర్థ రసాయనిక వ్యర్థాలను వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డంపింగ్ యార్డు పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, జంతు కళేబరాలు మరియు వ్యర్థ పదార్థాలు వేస్తున్న వారిపై భారీస్థాయిలో జరిమానా విధిస్తామన్నారు.
ఆటో నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్, ఫర్టిలైజర్ గోడౌన్స్, మెకనికల్ షెడ్డులను తనిఖీ చేసి, డ్రైనేజీ లైన్ల ద్వారా వ్యర్థాలను వేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, నాయకులు టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, సంతోష్ గుప్తా, రవి, బాలరాజు పాల్గొన్నారు.