కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి

14-10-2026 | 07:51pm

రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలి: కూనూరు సంజయ్ దాస్ గౌడ్..

చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్(Kunooru Sanjay Das Goud) డిమాండ్ చేశారు.

బుధవారం చిట్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సకాలంలో వర్షాలు కురవక, సాగునీరు అందక అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలు ఎండిపోయిన మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసి వడ్డీ మాఫీ చేయాలని, వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పనిదినాలను పెంచి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతుల పక్షాన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు లింగస్వామి, భువనగిరి పార్లమెంట్ నాయకులు బత్తుల నాగరాజు గౌడ్, సీహెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు