జిల్లాలో వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు ప్రణాళిక

14-10-2026 | 07:57pm
  1. సబ్‌స్టేషన్ల నిర్మాణ భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
  2. విద్యుత్ డిమాండ్ పెరిగే ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలి
  3. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, అక్టోబర్ 14 (విజయ క్రాంతి):జిల్లాలో వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో విద్యుత్ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం, గరిష్ఠ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జిల్లాలో నూతన విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులు, భూసంబంధిత సమస్యలు పెండింగ్‌లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన భూముల కేటాయింపును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కేటాయించిన భూములకు సంబంధించి రికార్డుల సవరణలు అవసరమైతే వాటిని సైతం త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు ముందుగానే పూర్తి చేయాలి

వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, అవసరమైన చోట పాత ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ పరికరాలు, ఇతర అవసరమైన సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. వేసవి ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ గంగాధర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు