బియ్యం.. కొందామంటే భయం!
- క్వింటా ధర రూ.8,500 నుంచి రూ.10వేలు
- సెప్టెంబర్ తర్వాతే ధరకు రెక్కలు
- బియ్యం వండలేం.. నిత్యావసరాలు కొనలేం!
- ధరల దెబ్బకు కుదేలవుతున్న సామాన్యుడి బడ్జెట్
కట్టంగూర్, అక్టోబర్ 29: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా..! అన్నచందంగా నిత్యావసరాల ధరల(Prices of essential commodities) పరిస్థితి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబరు వరకు సాధారణంగా ఉన్న ధరలు ఆ తర్వాత విపరీతంగా పెరిగాయనే చర్చ మార్కెట్లో వినిపిస్తోంది. ప్రస్తుతం బియ్యం రకం, నాణ్యతను బట్టి కిలో రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. దీంతో క్వింటా ధర రూ.8,500 నుంచి రూ.10,000 వరకు చేరింది.
వడ్ల కోతలు ఇప్పుడే.. ధరలు పైపైకి అప్పుడే..!
ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు రూ.2,461 మద్దతు ధర ప్రకటిస్తుండగా, బయట మార్కెట్లలో వడ్ల నాణ్యతను బట్టి రూ.2,500 నుంచి రూ.4,000 వరకు కొనుగోళ్లు జరుగుతున్నాయనే సమాచారం ఉంది. మరోవైపు కొత్త పంట కోతలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. ధాన్యం మార్కెట్కు పూర్తిస్థాయిలో చేరకముందే బియ్యం ధరలు పెరగడం చర్చనీయాంశంగా మారింది. వడ్ల కొనుగోలు ధరలు, బియ్యం విక్రయ ధరల మధ్య వ్యత్యాసానికి కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముందస్తుగానే ధరల పెంపు?
సెప్టెంబరు వరకు సాధారణంగా ఉన్న బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంపై వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ పరిస్థితులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ముందుగానే ధరలు పెంచుతున్నారా? లేక నిల్వలు, సరఫరా, రవాణా ఖర్చుల్లో మార్పుల వల్ల ధరలు పెరుగుతున్నాయా? అన్నది తేలాల్సి ఉంది. వ్యాపారులే ధరలు పెంచుతున్నారని నిర్ధారించే ఆధారాలు లేనందున, అధికారులు మార్కెట్ పరిస్థితులను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.
నిత్యావసరాలన్నీ ప్రియమే..!
బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాల ధరలూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఉల్లిపాయలు కిలో రూ.60, చక్కెర రూ.60, వెల్లుల్లి రూ.240, అల్లం రూ.100 వరకు పలుకుతున్నాయి. వంటనూనె లీటరు రూ.180, పామాయిల్ రూ.170గా ఉండగా.. కూరగాయలు కొనాలంటే అరకిలోకి రూ.50 కూడా సరిపోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. చికెన్ కిలో రూ.250300, మటన్ రూ.1,0001,200 వరకు ఉండటంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి.
ఎల్నినో అంచనాల ప్రభావమేనా?
ఎల్నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడవచ్చన్న అంచనాలపై చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గుతాయన్న ఊహాగానాలు ప్రస్తుత బియ్యం ధరలపై ప్రభావం చూపుతున్నాయా? సరఫరా తగ్గిందా? బియ్యం నిల్వలు, దిగుమతుల పరిస్థితి ఎలా ఉంది? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఊహాగానాల ఆధారంగా ధరలు పెరగకుండా, మార్కెట్లో వాస్తవ పరిస్థితులను అధికారులు పర్యవేక్షించాలి.
ధరలను అధికారులు నియంత్రించాలి
కొత్త పంట మార్కెట్లోకి వస్తున్న తరుణంలో ధాన్యం కొనుగోళ్లు, బియ్యం నిల్వలు, సరఫరాపై అధికారులు సమీక్ష నిర్వహించాలి. ధరల పెరుగుదలకు కారణాలను వెల్లడించడంతో పాటు, కృత్రిమ కొరతకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, సామాన్యులకు అందుబాటు ధరల్లో సరుకులు లభించేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.
నిరుపేదల బతుకు భారమవుతుంది..
బియ్యం ధరకు ఒక్క నెలలోనే రెక్కలు రావడంతో పాటు నిత్యావసరాల రేటు కూడా పెరగడంతో నిరుపేదల బతుకు భారమవుతుంది. ఏం తినాలన్నా.. ఏం కొనాలన్నా.. ఆలోచించి చేయాల్సి వస్తుంది. ధరలను కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ధరల నియంత్రణపై దృష్టి సారించాలి.
- యన్. సంధ్యారాణి, గృహిణి