ఢిల్లీలో కాలుష్య కోరలు.. ఊపిరాడని పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) గణాంకాల ప్రకారం శుక్రవారం ఉదయం నగరంలో గాలి నాణ్యత సూచీ (Air Quality Index) 270గా నమోదైంది. గాలిలో పీఎం 2.5 (PM2.5) కాలుష్య కారకాల ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సిరి ఫోర్ట్‌లో 348, జేఎన్‌యూలో 338, పూసాలో 337 ఏక్యూఐ నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాలు అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యత (Very Poor Category) జాబితాలో చేరాయి.మరోవైపు గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనిపించడంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో దశ ఆంక్షలను ఎత్తివేశారు. పాఠశాలలను సైతం తిరిగి ప్రారంభించారు.
కాలుష్య నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా సమీక్ష నిర్వహించారు. రోడ్లను యంత్రాల సాయంతో శుభ్రం చేయాలని, నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 300 దాటుతుండటంతో ఢిల్లీ వాసులకు కాలుష్యం నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించే పరిస్థితి కనిపించడం లేదు.