విజయమే లక్ష్యం

20-11-2026 | 05:15am
  1. వ్యక్తులను చూడొద్దు, పార్టీనే అభ్యర్థిగా భావించాలి
  2. గ్రాడ్యుయేట్, మున్సిపల్ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయాలి
  3. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు(BJP President N Ramchander Rao) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యక్తులను చూడొద్దని, పార్టీనే అభ్యర్థిగా భావించి ప్రచారం చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ చురుగ్గా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు. గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన, మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జ్ ఆశిష్ షెలార్ సమక్షంలో ఎన్నికలపై కీలక సమావేశం జరిగింది.

కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, వివిధ మోర్చాల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, పార్టీ సంస్థాగత సంసిద్ధతను సమీక్షించడంతోపాటు, పార్టీ నాయకులు, శాసనమండలి ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, స్థానిక సమస్యలపై పోరాటాలు, ఎన్నికల వ్యూహాలను రూపొందించడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు