జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి
- లేదంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెబుతాం
- డిసెంబర్ 14న రాంలీలా మైదానంలో బీసీ జనభేరి సభ
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
- సభకు పీసీసీ చీఫ్‌ను ఆహ్వానించిన బీసీ సంఘాలు
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): జాతీయ జనగణలో ఓబీసీ కాలం చేర్చాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జనవరి 10 నుంచి చేపట్టనున్న జాతి జనగణనలో ఓబీసీ కాలం డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బీసీల జనభేరి సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు కాంగ్రెస్ తరఫున హాజరుకావాలని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్(TPCC chief Mahesh Kumar Goud)ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం గురువారం గాంధీభవన్‌లో కలిసి ఆహ్వానించారు.
కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల బీసీ సంఘాలను సమన్వయం చేసుకొని వేలాది మంది బీసీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రతినిధి బృందంలో బీసీ జే ఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి సాగర్ తదితరులు ఉన్నారు.