జ్ఞానేశ్‌ను తొలగించడంలో జోక్యం చేసుకోండి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇండి కూటమి వినతి
సీఈసీ, ఈసీల జీవితకాల రక్షణ చట్టం వద్దు
సర్ వల్ల గల్లంతైన ఓట్లను పునరుద్ధరించండి
గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయండి
కూటమి బృందం రెక్వెస్ట్
రుజువులు అడిగారు.. సమర్పిస్తామని చెప్పాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సర్ ప్రక్రియలో అక్రమాలు, సీఈసీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదిముర్మును(President Droupadi Murmu) ఇండి కూటమి కోరింది. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను(CEC Gyanesh Kumar) వెంటనే తొలగించాలని, సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ చట్టాన్ని తొలగించాలని, గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ఓటరు జాబితాలో గల్లంతైన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, తిరిగి బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఇండి కూటమికి చెందిన 10 మంది సభ్యుల ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. ఎన్నికల మోసంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను రాష్ట్రపతి ఖండించలేదని, ప్రశ్నించలేదని, ఈ విషయం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
సాక్ష్యాధారాలు సమర్పించాలని ముర్ము ప్రతినిధి బృందాన్ని కోరారని, ఓట్ల దొంగతనం ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు దేశవ్యా ప్తంగా తెలిసి ఉన్నాయని, వాటిని సమర్పించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇండి కూటమి రాష్ట్రపతితో భేటీ అయిన అనంతరం రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ హౌస్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్లారు.
అయితే విజయ్ చౌక్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు నాయకులు ఆ ప్రదేశంలో ధర్నా చేశారు. అంతకు ముందు ఇండి కూటమి ఎంపీలు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో సమావేశమై తమ వ్యూహాలను రచించారు. ఓట్ల చోరీ అంశాన్ని ఇండి కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా,
సీపీఐఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఎన్‌సీపీసీపీ నాయకురాలు సుప్రియా సూలే, ఆర్‌జేడీకి చెందిన మనోజ్ ఝా, వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాజీవ్ రాయ్ తదితరులు ప్రతిపక్ష బృందంలో భాగంగా రాష్ట్రపతిని కలిశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞనేష్ కుమార్ రాజీనామాను కోరడం, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడం,
గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయడం వంటి చర్యల కోసం తమ అధికారాలను వినియోగించాలని వారు ఆమెను కోరారు. ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించే 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే అన్ని ఎన్నికలకు తిరిగి పేపర్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా ఇండి కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని కోరారు.
రాష్ట్రపతి ముర్ముతో సమావేశం అనంతరం, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని రాష్ట్రపతికి తాము స్పష్టంగా చెప్పామన్నారు. ఆమె మేము చెప్పినదాన్ని అంగీకరించి, ఆ తర్వాత ఎన్నికల మోసానికి సంబంధించిన రుజువులను తనకు అందించాలని మాతో అన్నారు’ అని చెప్పారు.
’వాటిని సమర్పించడానికి మేము సంతోషిస్తాం’ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈవీఎంలను పక్కనపెట్టి, బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖర్గే పునరుద్ఘాటించారు.
రాష్ట్రపతి భవన్ వైపు భారీ ర్యాలీ
శుక్రవారం రాత్రి సుమారు 8 గంటలకు ఇండియా బ్లాక్ ఎంపీలు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే పెద్ద బ్యానర్‌ను పట్టుకుని పార్లమెం ట్ హౌస్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీ చేశారు. విజయ్ చౌక్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్త తంగా మారింది. దీంతో పలువురు ప్రతిపక్ష నాయకులు ధర్నాకు దిగారు.
ఈ నిరసనలో పాల్గొన్న వారిలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ తదితరులు ఉన్నారు. అంతకుముందు, ఓటు దొంగతనం ఆరోపణలపై ఆందోళనను తీవ్రతరం చేయడానికి, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేయడానికి తమ వ్యూహాన్ని చర్చించేందుకు ఇండియా బ్లాక్ ఎంపీలు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు.