పాక్‌కు కేంద్రం ఆహ్వానం.. విపక్షాల ప్రశ్నలు
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 20 నుంచి 22 వరకు ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO Summit) నాగరికతల సంభాషణ సదస్సుకు పాకిస్థాన్‌ను ఆహ్వానించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌పై కేంద్రం అనుసరిస్తున్న విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పాక్‌తో సంబంధాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు భారత్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ తన ప్రతినిధిని ఖరారు చేసింది. ఆ దేశ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ (Musadik Masood Malik)ను సదస్సుకు పంపనున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 14న ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
2025లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ మంత్రి భారత్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎస్‌సీఓలో సభ్యదేశాలన్నింటినీ ఆహ్వానించడం సంప్రదాయ ప్రకారమేనని కేంద్రం స్పష్టం చేసింది. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ విధానంలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఈ పరిణామంతో భారత్-పాక్ సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ దౌత్య వైఖరిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.