అవినీతి పోలీసులకు కొత్త సీపీ వార్నింగ్

17-11-2026 | 10:10am

హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ మురళీధర్ భగవత్ పోలీస్ శాఖలో ప్రక్షాళనకు (Police Reforms) శ్రీకారం చుట్టారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాఖాపరమైన చర్యలతో పాటు నేర తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు (Criminal Cases) కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల కొందరు పోలీసు అధికారులు లంచం, బెదిరింపుల కేసుల్లో చిక్కుకున్న నేపథ్యంలో సీపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవినీతి, అక్రమ నిర్బంధాలు, భూవివాదాల వంటి పౌర సమస్యల్లో పోలీసుల జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవహారాలపై ప్రత్యేక విభాగం అధికారులు నిరంతరం నిఘా (Special Surveillance) ఉంచుతారని తెలిపారు.

పోలీసుల నుంచి ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే బాధితులు నేరుగా జోనల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఆరోపణలు రుజువైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇటీవల అన్ని జోన్ల ఉన్నతాధికారులు, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మహేశ్ భగవత్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీసులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

అలాగే అవినీతి, అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau)కు చిక్కిన పోలీసు సిబ్బంది వివరాలను కూడా ఆయన సమీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పోలీస్ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా కొత్త కమిషనర్ చర్యలకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు